తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. డాక్టర్ చిట్యాల రవీందర్ రాసిన కవితను చదవండి.
మృత్యు పేటిక నుండి
ఓ దీన హార్దిక స్వరపు
హిత వాక్యాలేవో వినబడుతున్నాయ్-
ఇంతవరకు తనను మోసిన భూమిని
ఇప్పుడు తను మోయడం అని
తల్లడిల్లుతూ ఉల్లేఖిస్తున్న
ఆనవాళ్లు కనబడుతున్నాయ్-
కొంత కాలపు నిర్లక్ష్యం యవ్వనంలో ఉన్న
తనను పడిపోయిన పండును
చేసిందని పశ్చాత్తాప పడుతున్న
వచనాలు లీలగా వినబడుతున్నాయి-
చిన్న చిన్న అప్రమత్తతలు ...
ముఖ కవచం,భౌతికదూరం నియమాలు పాటించకపోవడం వల్ల
తన దీపం కొండెక్కిపోవడం
అనుతాపంగా ప్రవచిస్తున్నట్టుగా ఉంది-
పెను ప్రమాదాన్ని ముందే వక్కాణించినా లేశం కూడా
లెక్క చేయకపోవడం శాశ్వత నిద్రకు
కారణభూతమైనట్టుగా ప్రస్తావించినట్టుగా ఉంది-
పదే పదే హస్త ప్రక్షాళన చేయకుండడం
పోషక పదార్థాలని విస్మరించడం
వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం
నిజంగా దుఃఖపు నదిలో
ఈదులాడినట్టుగా. ఉండి
జాగ్రత్తలు అందరికీ వివరిస్తూ
విన్నవిస్తున్నట్టుగా ఉందా స్వరం...
బహుశా స్వర్గం నుండే అయ్యుంటుంది.
అవును ...స్వర్గం నుండే...
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature