దిగజారిపోతున్న మానవ విలువలను దేవనపల్లి వీణావాణి కవితలో చదవండి.
మనుషుల్ని ఇలా చూడడం ..
నాకు కొత్తేమీ కాదు
కొత్తదల్లా తమను తామే
లోతుగా పాతిపెట్టుకోవడం
ఏదో పోగొట్టుకున్నవాడు
గాలిలో చూపును తేలేసి వెదుకుతుంటాడు
ఆ చూపు లోచూపుగా మారడం తప్ప
తీరం ఆనదు
undefined
లోకం
రెండుగా విడిపోవడం వెనుక
చేవేళ్ళ మధ్య తిరిగే రంగు కాగితాల నాట్యం ఉంటుంది
వాటి రెప రెపల శబ్దానికి మురికి ఉన్నా
విలువ మారదు
మనుషులు మనుషులుగా కాక
పోగుపడ్డ దేహాలుగా మాత్రం మిగిలి
చివికిన నెత్తురు నుంచి
సువాసన పీల్చడం నేర్చుకున్నారు
బలం అనుకున్నవాడు
నిజాన్ని తునకలుగా విడగొట్టి
ఒక్కొక్కటిగా
గెలుస్తాడు
మనం తునకల్లో ఉన్నాం కనుక
గెలువక పోవచ్చు
ఓడిపోవడం కూడా నాకు కొత్త కాదు
మసి పోసుకున్న గెలుపు కన్నా
తోక చుక్కలా రాలిపోవడమే గొప్ప కదా..
అలా
రాలిన తోక చుక్కల్ని చూడడమూ నాకు కొత్త కాదు..
లోతుల్లోంచి ఎగసిన దుఃఖానికి
కంపించే నేల మీద పడిపోయిన
హార్మ్యాల నిశిరాసులను
లెక్కించడమూ నాకు కొత్త కాదు
కొత్తదల్లా వేలం పాటకు నిలబెట్టుకున్న విలువలే .!