దర్బముల్లా గూర్ఖా విజిల్ తెలుగు కవిత

By Pratap Reddy KasulaFirst Published Jan 28, 2022, 5:20 PM IST
Highlights

ఒక ఈల లీలగా విన్పిస్తోంది.. ఎక్కడిది??.. ఎవరిది???అంటూ ఆసక్తి కరంగా  దర్భముళ్ల రాసిన కవిత "గూర్ఖా విజిల్" ఇక్కడ చదవండి :

ఒక ఈల లీలగా విన్పిస్తోంది.. ఎక్కడిది??.. ఎవరిది???
దయ తక్కువైందని దీనంగా మెడను చాచిన
దిగులు నిండిన గదిలోని దీపపు సెమ్మె మీద
సంక్లిష్టమైన సముద్రపు ఉప్పు గాలి ముప్పులాగ
సంవేదన నిండిన సందేహపు తుప్పు లాగ
సంధిగ్ధాయమానంగా సగం సగం చిమ్మబడి
నిలకడలేక ఊగుతున్న ఊదారంగు నిప్పు మీద
నిబ్బరంగా నిదానంగా ఆగాగి విన్పిస్తున్న
ఈమని వీణానాదం లాగ
ఈల చప్పుడు!

పక్క గదిలో వెల్తురు ఒలిపిరికి
ఒదిగిపోతూ ముడుచుకు పడుకున్న
జ్వరం పడ్డ చిట్టి పావురాల చిన్న మూల్గుల మధ్య
వెచ్చటి మూర్థానికి అరిగిపోయిన ముక్కులతో
ఆప్యాయత నందిస్తున్న ముసలి పక్షుల ఆత్రాల్ని అవలోకిస్తూ
నిద్ర బాట మీద నిలువునా రాలిపోతున్న
అర్థం కాని అయోమయపు పలవరింత ముద్రల
అడవిపూల పరిమళ పత్రాల్ని ఆఘ్రాణిస్తూ
ఆకతాయి కలల కలర్ రాళ్ళ కలత దెబ్బలకి
క్యాడ్బరీ చాక్లెట్ రేపర్ల రెక్కలకు రేగిన గాయాల్కి
విభిన్న వర్ణాల మల్హం వలయాలుగా అద్దేస్తూ
నిశ్శబ్దపు ఎడారి ఒడిలో ఓర్పు ఓయాసిస్ గట్లమీద
తీయటి కలవరింతల ఖర్జూరపు పళ్ళు కాయిస్తూ
పాత చలి బొంతల్ని పారవశ్యంతో చుట్టి పట్టేస్తూ
నాల్గు గోడల మధ్య నిమ్మళించని నాదస్వరంలా
నాటుకు పోతున్న నవ్వుల వనంలా
ఈల చప్పుడు!

అస్తవ్యస్త వస్త్రాల అభాసుపాలైన
అరకళ్ళ ఆభరణాల అర్ధాంగి అంతరంగం నుంచీ
మొలుచుకొచ్చిన ఒంటరి నల్ల నక్షత్రంలా మెరుస్తూ
తెలిమంచులో ప్రక్షాళన చేసిన తెల్ల చామంతి లాంటి
మచ్చలేని మగ్దలీనా(1) ముఖ సౌందర్యాన్ని ముద్దాడేస్తూ
కనుబొమ్మలు కరువైనా కాఠిన్యం చూపని
మోనాలిసా(2) అవ్యక్త సందేశాన్ని ఔపాసన పట్టేస్తూ
కలల పట్టణంలో కబోది దేశదిమ్మరి కష్టంలా
మండే కళ్ళ మెలకువల మైదానంలో
గారాల వర్షం ఇష్టంగా క్లుప్తంగా కురిపించేస్తూ
గాజుల కువకువల్ని గుప్పెడు గాజు గూటిలో గుప్త పరిచేస్తూ
మనసుతో మెత్తగా మంద్రంగా మమైకమైన
ఈల చప్పుడు!

గర్భవిచ్ఛిత్తితో తొలి బిడ్డను పోగొట్టుకున్న
గరీబు తల్లి రోదనలా
మెడలు వంగినా 'వెటరన్ ఒలంపిక్స్' లో గోల్డ్ మెడల్ గెల్చుకుని
ఏనుగెక్కిన ఎనభై ఏళ్ల విజయ సాధనలా
తన నేపాల్ ప్రేయసి చెంతకు చేరాలనే నెపంతో
ఏ పాపాల పూత పూయని లేలేత పవిత్ర ప్రేమ వేదనలా
ఒక్కొక్కసారి హృదయ విదారకంగా
ఇంకొకసారి ఆహ్లాదకరంగా
మరోసారి మనోనైర్మల్యం కడిగేసే
పాలబుగ్గల పసిపాప బోసినవ్వుల సావాస సాధికారంగా
భయాల్ని బెంగల్ని తుడిచేస్తూ
ధైర్యాన్ని దరి చేరుస్తూ
మా వీధి గూర్ఖా వేస్తున్న విజిల్
అలసట లేకుండా అన్ని రాత్రుల్లోనూ అలికిడి చేస్తూ
అలికి గుమ్మం ముందర అమ్మ వేసిన ముగ్గు లాగా
అందరికీ ఆర్తిగా కన్పిస్తోంది
గాలిలో జాలి జాలిగా, జాలీగా స్ఫూర్తిగా విన్పిస్తూనే ఉంది!
ఒక ఈల లీలగా విన్పిస్తోంది... ఎక్కడిది?... ఎవరిది???

1. St. Mary Magdalene was a disciple of Jesus. According to the Gospel accounts, Jesus cleansed her of seven demons. She was the witness to his Crucifixion and first one to witness his Resurrection.

2. The Mona Lisa when Da Vinci painted her did indeed have eyebrows but that over time and over cleaning have eroded them to the point that they are no longer visible. 

click me!