తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం చిన్నకథలు. దర్భముళ్ల రాసిన రెండు ఆలోచనాత్మక చిన్న కథలను సరదాగా చదవండి.
మార్పు
'ఇదేంటి......?! ఇదిక్కడ ఇలా...!!'
ఆశ్చర్యంగా ఇంట్లోకొస్తూనే అడిగిందామె?
'అవును మరి... ఇప్పుడున్నది అప్పుడు లేదుగా?' బదులిచ్చాడతడు!
తలెత్తి చూసి, 'అరెరే..... ఇదేంటి? నీకిది నచ్చదుగా!' అతడ్ని పరిశీలనగా చూస్తూ అన్నదామె.
'లేదు! లేదు! నువ్విక్కడ లేవుగా... నీ జ్ఞాపకంగా రోజూ ఇదే!' తలదించి అతడి జవాబు.
విచ్చిన పువ్వుల్లాంటి రెండు నవ్వులు చిమ్మి, మెచ్చుకోలుగా.... 'సరిపోయింది! ఒక మార్పు కష్టంతో ఇంకో మార్పు ఇష్టంతోనా......??' ఇల్లంతా కలియతిరిగి కళ్ళల్లో నీళ్ళతో కవ్విస్తూ అన్నదామె.
రెండు మార్పులకు రెండు ప్రశ్నలని బదులివ్వక ఒక్క కౌగిలిలో ఆమెను బంధించాడతడు.
కొట్టొచ్చినట్టుగా హాల్లో ఎదురుగుండా పెరట్లోది పీకి శానిటైజేషన్ కోసం కొత్తగా పెట్టిన 'సింకు' . అతడు పెట్టెలోంచి తీసి వేసుకున్న ఎప్పుడూ నచ్చుకోని రంగు చొక్కా 'పింకు' రెండూ కూడా తనివితీరా నవ్వుకున్నాయి!!!!!!
* * *
13వ నెంబర్ బెడ్
"కనీసం తిండైనా తిను... నిద్రెలాగూ లేదు కదా!"
గత 48 గంటలుగా నిద్రపోని కూతుర్ని చూస్తూ ప్రేమగా గద్దించింది తల్లి. ఆమె జైల్లో వార్డెనులా కనిపించింది కూతురికి.
"ఉహూ!" అని తల అడ్డంగా తిప్పి లేచి పరిగెత్తిందా కొత్త డాక్టర్.
ఆమె మనసంతా ఒకటే ఆందోళన... 'ఆ 13 వ నంబర్ బెడ్ పేషెంట్ ఎలాగైనా బతకాలి!' తను కుట్లు వేసిన మొదటి కేసు. మనసులోనే మొక్కుకుందామె... "దేవుడా! అతడెలాగైనా బతకాలి!"
**************
"ఇంకొంచెం కావాలా?" ఇలా ఈ జైలు కూడుని నీలా ఇంత ఆనందంగా తిన్నవాళ్లని ఇంతకుముందెప్పుడూ చూడలేదు". నిద్రపోతున్న ఖైదీని లేపుతూ అంది మేట్రన్. మధ్య వయస్కురాలైన ఆడ ఖైదీకి చిన్నప్పుడు పోగొట్టుకున్న తల్లిలా కనిపించిందామె.
శరీరం నిండా కనిపించే గాయాలైతే కనిపించని గాయాలతో ఉన్న మనసుతో నిండిన ఖైదీకి ఒకటే ఆలోచన... "ఆ నరరూప రాక్షసుడు ఎలాగైనా చావాలి!"
తను ఎన్నో విధాల సహించి విసిగి వేసారి ఆఖరికి నరికేసింది. మనసులోనే మొక్కుకుంది ఆమె. "స్వామీ! వాడెలాగైనా చావాలి!"
********************
పాప పుణ్యాల్ని త్రాసులో తూచే మారాజు 13 నెంబర్ బెడ్ గురించి పాపం గొప్ప సందిగ్ధంలో పడ్డాడు!!!!