కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెనోళ్ల ప్రశంసలు అందుకుంటోంది. వారిపైనే బూర రాజశేఖర్ ఓ కవిత రాశారు.
ఓ ఉదయం
నువ్వలా దర్జాగా ఆఫీసుకెళుతూ
వీధి చివర మురికి కూపాన్ని శుద్ధిచేయ
పందులతో పోటిపడుతున్న అతన్ని చూసి
అసహ్యంతో ముఖం చిట్లించుకుని
కంపరంతో చిర్రెత్తిపోయావు..
ఓ మధ్యాహ్నం
నువ్వలా సరదాగా షికారుకెళ్తు
నడిరోడ్డులో దీపపుస్తంభమై
దారితప్పినవారిని గాడిలో పెట్టె అతన్ని చూసి
చిరాకుతొ చిల్లర రాబంధులంటూ
చీదరించుకుంటు వెళ్ళి పోయావు..
ఓ సాయంత్రం
నువ్వలా నీరసమైనప్పుడు
మనిషియంత్రాల మరమ్మత్తుల మాంత్రికుడైన
తెల్ల కోటులోని అతని చిరునవ్వును చూసి
జబ్బు పేరుతో డబ్బులాగే తాంత్రికుడంటూ
నిర్లక్ష్యంగా నిందలేసి పోయావు..
ఓ రాత్రివేళ
నువ్వలా నిర్లిప్తమై హాస్పిటల్లో
వందల రోగులకు తల్లై విసిగిపోయిన
ఆ ప్రాణధూతలోని అసహనాన్ని చూసి
చిన్నచూపుతో పని చేతగాని పొగరుబోతంటూ
బూతులదండకం వినిపించావు..
ఇప్పుడు
ఈ నిశ్శబ్దంలో
ఆ నలుగురే కదా..
పగలు - రేయి
కుటుంబాలకు దూరంగా
నీ కుటుంబం కోసం పనిచేస్తున్నారు.
ఆ నలుగురే కదా..
నీకు - నాకు,
దేహాలకు - దేశాలకు
నలుదిక్కుల రక్షణ కవచాలైనిలిచారు.
ఆ నలుగురే కదా..
ప్రపంచమే
గృహనిర్బంధమైనప్పుడు
ఆయువునిలిపె సైనికులై మనకోసం
అలుపెరుగని యుద్ధం చేస్తున్నారు.
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature