దాశరథి పురస్కార విజేత ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఇదీ...

By telugu teamFirst Published Jul 25, 2021, 12:45 PM IST
Highlights

దాశరథి కృష్ణమాచార్య అవాల్డు విజేత డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గురించి భీంపల్లి శ్రీకాంత్ వివరించారు. ఆచార్య శివారెడ్డి జీవిత విశేషాలు చదవండి,.

తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి 2021 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం దాశరథి పురస్కారం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఈ పురస్కారాన్ని తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన కవులకు, రచయితలకు ప్రతి ఏటా అందజేస్తున్నది. ఈ పురస్కారం కింద పురస్కార గ్రహీతకు ఒక లక్ష వెయ్యి నూటపదహార్లను నగదుగా అందజేస్తున్నది.

సాహిత్యవేత్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, ఆచార్యుడిగా, కవిగా, రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా, పత్రికా కామెంటరీగా పేరుగాంచిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్టులు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శివారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం ఎల్లూరు గ్రామంలో నరసమ్మ, మందారెడ్డి దంపతులకు నాల్గవసంతానంగా జన్మించారు.
శివారెడ్డి ప్రాథమిక విద్యను తమ గ్రామంలోనే, హైస్కూలు విద్యను కొల్లాపూర్ లో చదివి పీయూసీ నుంచి పిహెచ్.డి వరకు హైదరాబాద్ లో చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చదివి స్వర్ణపతకాన్ని సాధించారు. అనంతరం డాక్టర్ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో "ఆంధ్ర మహాభారతంలో రసపోషణం" అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టా పొందారు.

ఉద్యోగ జీవితం
===========
తన చదువు పూర్తయిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. 30 సంవత్సరాలకు పైగా అదే విశ్వవిద్యాలయంలో వివిధ అత్యున్నత హోదాలలోను పనిచేశారు. 1992 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి రీడరుగా, ప్రొఫెసర్ గా, తెలుగుశాఖ అధ్యక్షులుగా, పాఠ్యప్రణాళిక చైర్మన్ గా పనిచేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పాఠ్యప్రణాళిక సభ్యులుగాను పనిచేశారు. 2002 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం శాఖాధిపతిగా పదవీవిరమణ చేశారు. అనంతరం ఆయన తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా 2012 నుంచి 2015 వరకు పనిచేశారు. 

పర్యవేక్షకుడిగా అందవేసిన చెయ్యి
========================
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో ఎందరో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ వారి ఎం.ఫిల్, పిహెచ్.డి పరిశోధనలు పూర్తికావడానికి తన  సహాయసహకారాలనందించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో దాదాపు 55 మంది పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకుడిగా ఉన్నారు. వీరి పర్యవేక్షణలో అనేక గ్రంథాలు కూడా వెలువడ్డాయి.

రచనలు
======
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి "తిక్కన రసభారతి, రసరేఖలు, భావదీపాలు, పూలకారు, సురవరం ప్రతాపరెడ్డి జీవితం - సాహిత్యం" వంటి గ్రంథాలను రచించారు. "సురవరం ప్రతాపరెడ్డి జీవితం - సాహిత్యం'' అనే గ్రంథానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ప్రసిద్ధ విమర్శకులు కట్టమంచి రామలింగారెడ్డి రచించిన "ముసలమ్మ మరణం" పద్యకావ్యానికి చక్కని వ్యాఖ్యానం చేశారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రచురించిన పలు గ్రంథాలకు ఆయన సంపాదకత్వం వహించారు. అనేక సాహిత్యపత్రికలకు శతాధిక పరిశోధక రచనలు చేశారు. అలాగే వివిధ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సాహిత్యసదస్సులలో 45 పరిశోధన పత్రాలను సమర్పించారు.

సంపాదకకీయాలు
==========
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అనేక గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. సురవరం ప్రతాపరెడ్డి వైజయంతి ట్రస్ట్ ప్రచురించిన అనేక గ్రంథాలకు వీరు సంపాదకులుగా వ్యవహారించారు. "గోల్కొండ పత్రిక సంపాదకీయాలు (రెండు భాగాలు), సురవరం ప్రతాపరెడ్డి నాటకాలు,
సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు, సురవరం ప్రతాపరెడ్డి కథలు, సురవరం ప్రతాపరెడ్డి పరిశోధన జ్ఞాపికలు,
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు (రెండు భాగాలు),
హిందువుల పండుగలు, రామాయణ విశేషాలు" వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఇంకా "సినారె సాహిత్య సమాలోచన, ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వర్ణోత్సవ సంచిక, వజ్రోత్సవ సంచిక, తెలుగు- తెలుగు నిఘంటువు, పరిణితవాణి, తెలుగు సాహిత్యంలో హాస్యం, సాహిత్యానువాదం - సమాలోచనం, తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం, వివేచన" వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. 

పురస్కారాలు
==========
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలుగు సాహిత్యానికి చేసిన సెవకు గుర్తింపుగా వివిధ సంస్థలు అనేక పురస్కారాలను అందజేశాయి. సురవరం ప్రతాపరెడ్డి జీవితం గురించి 1972 లో రచించిన "సురవరం ప్రతాపరెడ్డి జీవితం - సాహిత్యం'' అనే గ్రంథానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1998 లో "పూలకారు" పద్యకావ్యసంపుటికి స్వర్ణసాహితి పురస్కారాన్ని, రసమయి సంస్థ సురవరం సాహితి పురస్కారాన్ని, బాబుల్ రెడ్డి ఫౌండేషన్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, రసమయి టాలెంట్ అవార్డు, కవిత్రయ అవార్డు, జ్యోత్స్న కళాపీఠం అవార్డు, కవిరత్న నీల జంగయ్య అవార్డు, రసమయి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, మహాకవి దాశరథి అవార్డు, ఇరివెంటి కృష్ణమూర్తి అవార్డు, రసమయి దేవులపల్లి రామానుజరావు అవార్డు, నాట్స్ జీవిత సాఫల్య పురస్కారం, ఆచార్య పల్లా దుర్గయ్య స్మారక అవార్డు, యువకళావాహిని బి.ఎన్. అవార్డు, రాయసం సుబ్బారాయుడు సాహిత్య అవార్డు, తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి పురస్కారం, డి.టి.ఎ. ఎక్సెలెన్స్ అవార్డు, డా.అంజిరెడ్డి సాహిత్య పురస్కారం, ఢిల్లీ తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ అవార్డు, కె.వి.రమణ జీవన సాఫల్య పురస్కారం, సృజన జీవన సాఫల్య పురస్కారం, అభినందనలహ సినారె పురస్కారం వంటివెన్నో పురస్కారాలను అందుకున్నారు. 

సాహితీవేత్తల హర్షం
==============
ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి దాశరథి పురస్కారం లభించడం పట్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రచయితలు వేదిక జిల్లా అధ్యక్షుడు జలజం సత్యనారాయణ, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు దక్కిన గౌరవంగా వారు అభివర్ణించారు.

అవార్డు స్వీకరించిన శివారెడ్డి
===================

దాశరథి సాహితీ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గురువారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్కాటక, యువజన సర్వీసులు, క్రీడలు, ఎక్సైజ్, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. శివారెడ్డికి అవార్డుతో పాటు ఒక లక్ష  వెయ్యినూట పదహార్ల రూపాయల చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

- భీంపల్లి శ్రీకాంత్

click me!