రంగరాజు పద్మజ కథ : రోలు- రోకలి

By Arun Kumar P  |  First Published Oct 3, 2022, 10:17 AM IST

ఒకప్పుడు తెలంగాణలో పాలకుల నిర్లక్ష్యం, వరుస కరువులు వెంటాడుతుంటే పండుగ పూట కుల మత రహితంగా గ్రామ ప్రజల సహకారం ఎలా ఉండేదో  రంగరాజు పద్మజ రాసిన కథ " రోలు- రోకలి " లో చదవండి :


మండకరువుతో మలమలమాడుతున్న మా ఊరు జనాలకు రోజు వారీ గడవడమే కష్టం. అలాంటిది ఐదారేండ్ల సంది వానసుక్క లేక - చెరువుల కింద నీళ్ళు పారితేనే వడ్లు పండే పొలాలాయె! - సోలెడు గింజలు పండక అప్పు- సప్పు చేసి బతుకు ఎళ్ళ దీస్తున్న మా ఊరోళ్ళకు పండగ వచ్చిందంటే పానం మీదికి వచ్చినట్టే!! అట్లాంటిది ఇగ దసర దీపావళంటే పెట్టుపోతల పండగలాయె! మా ఊళ్ళ ఏపండగకు వచ్చినా రాకపోయినా దసర- దీపావళి పండగలకు ఆడపిల్లలను- అల్లుండ్లను తప్పక తీసుకొచ్చుకోవాలె! తోటోండ్లు అందరు అవ్వగారిండ్లకు పోతే...ఎవ్వలన్న ఆడపోరగాండ్లు అత్తగారింట్ల ఉంటే మస్తు ఏడుస్తరు..కష్టమో? సుఖమో ఏ తిప్పలన్న పడి ఆడపిల్లలను తీసుకొచ్చుకుంటరు తల్లి తండ్రులు...

అందుకే దసరా-దీపావళి వచ్చిందంటే మా ఊళ్ళో పెద్దోళ్ళకు పాపం! పైసల్లేక మస్త్ పరేషాన్! పండగనాడన్నా అప్పతునకలు చేయాలె! పనిపాటలు చేసేటోళ్ళకు, పిల్లగాండ్లకు బట్టలు కొనాలె ! ఎవరన్నా ఇంటికొచ్చినోళ్ళకు బక్షీస్ ఇయ్యాలె! గుమ్మిల జూస్తె వడ్లులేకపాయె! ఏం అమ్మితే ? ఖర్సులెల్లుతయో తెలియక పాయె! అప్పెవ్వరిస్తరొ తెలియక పాయె! దసరా పండుగనాడు తెలిసినోళ్ళు ఎవరన్నా జమ్మి పట్టుకొని వచ్చి చేతుల పెడితే  వాళ్ళకి ఇనాం ఇయ్యాలె?

Latest Videos

పాలపిట్ట దర్శనం చేసుకొనేందుకు ఊళ్ళ అందరు కొత్త దోతులు కట్టుకొని వస్తరు! ఇంట్ల ఆడపిల్లలు వచ్చిన్రు! కట్నం బట్టలమాట అటుంచితే... మంగళహారతి పడ్తే ... రూపాయి లేకపాయె! హారతిలో ఏం పైసలేద్దును? అని ఫికరు పడుతున్న తండ్రి దగ్గరకి పెద్దబిడ్డ వచ్చి, "నాయనా! వచ్చే దసరాకు ఏద్దువుగాని తీయ్! ఎప్పటికి రోజులు గిట్లనే ఉంటయా? కాలం అయితే ఎకరాన మూడు పుట్లు పండక పోతయా? మన ఎతలన్నీ తీరక పోతయా? పండగపూట రంధిగ కూసోకు! మనకు భీ మంచి రోజులొస్తయ్ తీయ్!  నేను తెచ్చుకున్న బట్టలు కట్టుకుంట! అల్లుడికి నువ్వు కొనిచ్చినవని చెప్తా!

ఎండాకాలంల సుట్టాల పెళ్ళికి పోతె వాళ్ళు నీ అల్లుడికి దోతుల చాపు కట్నాలు పెట్టిండ్రు. మా ఆయన దోతి కట్తడా? ఏమన్నానా! అది మడత ఇప్పకుండ అట్లనే ఉన్నది. అల్లుడి చేతికీయ్! వచ్చే దసరకు పాయింటు- అంగీ కొనిద్దువుగాని " అంటున్న బిడ్డ మాటలు తలుపుచాటు నుంచి వింటున్న తల్లి ఏడుపు బిగపట్టుకుని, చప్పుడుచేయక చేదబాయి మీదికి పోయి అక్కరలేని నీళ్లన్నీ చేదుతున్నది. ఆమెది ఏమీ చేయలేని నిస్సాహయత!

పెళ్ళయిన బిడ్డ-అల్లుడికి కట్నాలు పెట్టలేక పోయినా...  పండగనాడు తొడుక్కునేందుకు చిన్న పిల్లకు ఒక్క గౌను కుట్టించే పరిస్ధితి లేకపాయె! మగ పిల్లగాడంటే అంగీ- నెక్కరు సుబ్బు పెట్టి ఉతుక్కొని, చెంబుల నిప్పులు పోసి ఇస్త్రీ చేసుకోని తొడుక్కుంటడు... గానీ ఊళ్ళ ఆడపిల్లలు తీరొక్క తీరు బట్టలు, సొమ్ములు , రిబ్బన్లు , పక్కపిన్నుల దగ్గర నుంచి, గాజులు, కంకణాలు , గోళ్ళ రంగులు, పౌడర్లు, స్నోలు, జడగంటలు, కుచ్చుల జడలు ఓహ్! ఎన్నిరకాలో??  పాపం ! సిన్నపిల్ల ఒక్కటి కూడా కొనియ్యలేని పరిస్థితిని ఇచ్చే దేవుడు!  ఒక్కొక్క సారి దేవుడికి దండం పెట్టబుద్ధి ఐతలేదు.. అనుకుంటూ.. బాధపడుతున్నప్పుడే...బజార్ లో ఏదో అమ్ముతున్నట్టు కేకలు వినపడ్డయ్!

" నైలాన్ బట్టలున్నయ్! ఫుల్ వాయిల్, ఆఫ్ వాయిల్, కోడంబాకం, దూప్ చాన్ చీరలు, మిరియాల చీరలున్నయ్! అగ్వ_సగ్వ బేరం ! ఉద్దెర బేరం! రెండుసార్ల కట్టొచ్చు! మంచి బేరం పోతె దొరకదు !" అని బట్టల రాజయ్య సైకిల్ మీద బట్టల మూట పెట్టుకొని , వాయిదాల పద్ధతిలో బట్టలమ్ముతున్నడు. బజార్ లో బస్ స్టాండ్ నుండి అంగడికి పోయె తోవలో చావడి దాక అటునుంచిటు ఇటునుంచటు తిరుగుతున్నడు.ఆ అమ్మేకేకలు విని ఆ పిచ్చమ్మ బట్టల మూటాయన దగ్గర బట్టలు ఉద్దెరకు తీసుకొని, 4రూపాయలు పెట్టి ఇద్దరు పిల్లలకు గాజులు పెట్టిస్త అనుకొంటూ ...కొద్దిగా ఊపిరి తీసుకున్నది... భారంగా ఆ ఆడపిల్లను కన్న మధ్యతరగతి తల్లి పిచ్చమ్మ.

ఉద్దెరకు  బట్టలు ఇచ్చే రాజయ్య కేకలు విని వాడల అందరు పండగకు బట్టలు కొనుక్కోవచ్చు అని హుషార్ అయిన్రు. ఇగ ఎవరెవరికి ఏం బట్టలు తీసుకోవాలె అని చిట్టి రాసుడు, షురూ చేసిండ్రు!  ఎట్లయిన పంటొచ్చినాక పైసలు కట్టుడేనాయే ! అని ధైర్యంచేసి, పెద్దోళ్ళు చీరలు ,రైకలు, దోతులు కొన్నరు. పండుగ రానే వచ్చె, ఇగ ఆడపిల్లలకు మగపిల్లలకు ఒక్కటే తాను తీసుకొని మేరాయన (టైలర్) కిస్తే అందరికి ఒకటే తీరుగా బీన్ బాజా వాయించోండ్ల తీరుగ కుడ్తడు! అవ్వన్న సమయానికి అంగీలు- లాగులు కుట్టక  పాయె, మేరాయన ఇంటికి తిరుగీ తిరిగీ కాళ్ళు అరిగిపోయె! పండగ సగం ఐపోబట్టే  బట్టలు కుట్టియ్యక పాయె ... "ఏమన్న అంటే పండగ గిరాకీ నేనేం జేయాలే ?" అంటడు మేరాయన! పది రోజుల ముందగాల ఇయ్యాలె అనబట్టే! మరి బట్టల రాజయ్య నేమో పండగ కంఠం మీదికి వచ్చినాక వచ్చి ఉద్దెరకు బట్టలిచ్చె!

మేరాయనకు ఈ బట్టలు కుడితె కుట్టుకూళ్ళు కూడా తిప్పిచ్చుకోని, తిప్పిచ్చుకోని ఇస్తరని తెలుసు. కానీ ఏడపోవని కూడా తెలుసు.  అందుకే కాస్త నిర్లక్ష్యమైనా సరే కుట్టి ఇస్తడు.   కానీ గుండీలు కుట్టే సమయం లేదంటడు, కాజాలు కుట్టడు, రైకలకైతే గల్లా చేతిపనికూడా చేయడు. ఉక్కులు, గుండీలు కుట్టడు. అసలు అంగీ - నెక్కరైతే చాలని మగ పిల్లలు, కొత్త రైక అయితే చాలని ఆడ పిల్లలు ఓర్సు కుంటరు.  ఎందుకంటే తోటి బడిపిల్లలు జమ్మి చెట్టుదగ్గరికీ, కోయిల్ల ( గుడి) కు మంచిమంచి కొత్త బట్టలు తొడుక్కొని వస్తరు. అందరు బట్టలు చూస్తరు. గల్లాకు వంకరకుట్టు లేకున్నా , నిక్కరకు , అంగీలకు గుండీలు కుట్టకున్నా పిన్నీసులు పెట్టుకొని అట్లనో ఇట్లనో గవ్వే తొడుక్కొని పండగనెల్ల దీస్తరు.
         
టపాసులు , రోలు రోకలి ( గంధకం బిళ్ళపెట్టి రోకలితో కొడితె టప్ప్ అని చప్పుడొస్తది) పట్టుకొని  గుంపులు జమ కాంగనే టప్ ..టప్ మని కొడతరు పోరగాండ్లు. మస్త్ నవ్వుకుంటు ఆడుకుంటరు.  టపాసులు ఉద్దెరకు దొరకయ్! దుకాణంలో ఉద్దర పెట్టడు. వచ్చే ఏడు కొనిస్త అని బుద్ది తెలిసినప్పటినుంచి అంటున్నది అమ్మ...గిన్నేండ్లాయె ! ఒక్కపాలి కూడా మందుగుండు కొనక పాయె! వ్చ్ ! వ్చ్!! అనుకుంటు రోలు రోకలి , టపాసులు కొట్టేటోండ్లను చూసుకుంట మురుస్తున్నరు అక్కా తమ్ముడు తామె కాలుస్తున్నట్టు.

దూరంనుంచి ఇదంతా చూస్తున్న సాయెబుల పిల్లగాడు ఇంటికి ఉరికిండు ! వాళ్ళ నాయనతో " అబ్బా! చారానో దేదోనా ! అబ్బా! చారానా దేదోనా! " అని అడిగితే " ఎందుకురా ? బేటా ? " అంటే  " ముఝే చాహియే ! " అని ఏడుపు ముఖం పెట్టిండు.  ఆ సాయెబు బడిలో చెపరాసీ ( అటెండర్) పనిచేస్తడు కాబట్టి ఫైలి ఫైలీకి ( ఫస్ట్ తారీఖున) జీతం వస్తది.  ఇద్దరే పిల్లలు.  మంచి బతుకే బతుకుతున్నడు కనుక కొడుకు అడగంగనే  'చారానా' ఇచ్చిండు.  ఆ పిల్లగాడు వెంటనే   దువ్వెన పురుగోలె రయ్ రయ్! మని ఉరుక్కుంటూ దుకనం (షాపు) లకు పోయి రోలు రోకలి, టప్ టప్ మనే గంధకపు ఎఱ్ఱటి బిళ్ళల డబ్బా కొనుక్కొని వచ్చి పిచ్చమ్మ కొడుకు బుచ్చయ్యకిచ్చిండు. బుచ్చయ్యకు ఆశగానే ఉంది తీసుకోవాలనీ, టపాసులు కొట్టాలని, కానీ అక్క కోప్పడతదని భయంగ మొఖం పెట్టి, " వద్దు వద్దు " అని పైపైకి అంటున్నడు. 
" ఏంచేస్తున్నరు ఇద్దరు ? ఆ గుసగుసలేంది ? " అని అడిగింది అక్క. 
" రహీమ్ టపాసు, రోలు రోకలి తీసుకోమంటున్నడు " అన్నడు తమ్ముడు.
" వద్దు తమ్మీ! అమ్మ కొడతది ! వద్దు "  అంటూ చెయ్యి బట్టుకొని బరబర ఈడ్చుకుంటూ పోతుంటే...
"ఉట్టిగ తీసుకోకు దీదీ! మళ్ళ మీరు కొనుక్కున్నప్పుడు నావి నాకిచ్చేయి! ఈ పండగ మాకుండదు! మా రంజాన్ పండగప్పుడు ఇద్దురు గానీ తీసుకోండి ! " అని అంటూంటే తమ్ముడికి ఆ మాటలు నచ్చినయ్! అక్క తీసుకోమంటే బాగుండు అన్న మొఖం పెట్టిండు.

తమ్ముడి మొఖం చూసి జాలి అయింది కానీ నాయన ఎవరి సొమ్ముకు ఆశపడవద్దు అని చెప్తడు.  నాయన మాట కాదనాలా? తమ్ముడి చిన్న కోరిక  తీర్చాలా ? ఆ చిన్నబుర్రకు తట్టక యమ యాతన పడింది అక్క.  కళ్ళల్లో నీళ్ళు నిండుతుంటే ఉరికి అర్రల దాక్కున్నది.  చేతులతో ముఖం కప్పుకొని ఎక్కెక్కి ఏడ్చింది. ముక్కు చీమిడి కారుతుంటే గౌనుతోటి తుడుచుకుంటూ " కాలం కాక ఈ మండ కరువు మా ప్రాణాలు తీయబట్టే! ఈసారికి కూడా మరీ ఒక్క వాన చినుకు కూడా పడలేదు.  ఈ ఎండాకాలంల మంచినీళ్ళకే కష్టం ఐతది! ఇగ పంటెక్కెడ ? చేతిల పైసలెక్కడ? ఎన్నేండ్లు ఇట్ల గడువాల్నో? తమ్ముడు చదువుకొని ఉద్యోగం చేస్తే అమ్మ కష్టం తీరుతది.  దేవుడా! మా తమ్ముడికి మంచి చదువు రావాలని దీవెనలియ్యి దేవుడా !"  అనుకుంటూ ఆ మూల అర్రలో ఏడుస్తూనే ఉన్నది. 

అక్క దోస్తులతోటి ఆడుకోను బోయిందని అనుకున్నది అమ్మ! తల్లికి ఇంటి పనిలో సాయం చేయడానికి పోయిందనుకున్నడు నాయన ! తమ్ముడు మాత్రం అర్రకు అటువైపున్న తలుపు దగ్గర నిలబడి అక్క వచ్చి రహీమ్ దగ్గర టపాసులు, రోలు రోకలి తీసుకొమ్మని చెప్పితే బాగుండు! అందరు జమ్మిచెట్టు దగ్గరకు అప్పుడే పోయిన్రు! చీకటైతే నేను రోకలి తోటి కొట్టినా ఎవరికీ చప్పుడు ఇనపడదు, కనపడదు అని బిక్క మొహం వేసుకొని తలుపు గొళ్ళెం బలంగ పట్టుకొని యాళ్ళాడుతున్నడు... పాపం! వాడికి మాత్రం ఏంతెలుసు? చిన్నతనం! తన సొమ్మా? పరాయి సొమ్మా? అని తెల్వదు. తోటి పిల్లగాండ్లు ఆడుకున్నట్టు ఆడుకోవాలనే ఖాయిష్ తప్ప ఏం తెల్వదు - అనుకొని జప్పున కండ్లు తుడుసుకొని ఇంటిముందుకొచ్చి "రహీమ్ ! ఓ రహీమ్! " అని పిలిచేంతలోనే గోడకు పిల్లి వలె ఒదిగి ఉన్న రహీమ్ వచ్చి  " దీదీ!  పిలిచినవా? " అన్నడు.
" ఔను ! రహీమ్ ! మీ రంజాన్ పండగకు మా నాయన రోలు రోకలి , టపాస్ కొనిస్తడు.  ఇప్పుడు నీ టపాసులు మా తమ్ముడికిస్తవా? "  అనంగనే  " అట్లనే దీదీ. తీసుకొమ్మని చెప్పు. లేకుంటే తీసుకోడు. అప్పటినుండి బతిలాడుతున్న కానీ దగ్గరకు వస్తలేడు.  మా అక్క చెప్తే తీసుకుంట అంటున్నడు "   గబగబ అని చటుక్కున ఆ మందుగుండు తమ్ముడి చేతులో కుక్కి, తేనెటీగోలె ఉరికిండు రహీమ్!

తమ్ముడి కళ్లల్లో సంతోషం చూసి, తప్పుచేయలేదని మనసు సరిపెట్టుకొంది అక్క.  ఇంతలో   " కుంపట్లో పిడికవేయే, అగ్గి సల్లారితే ఇంట్ల అగ్గిపెట్టె కూడా లేదు " తల్లి పిలుపుతో ఇంట్లకురికింది అక్క.

 

click me!