శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత బండి నారాయణ స్వామి ఏషియానెట్ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు. అవార్డు శప్తభూమి నవల పాఠకులకే అంకితమని బండి నారాయణ స్వామి అన్నారు.
అనంతపురం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంలో బండి నారాయణస్వామి Asianetnewsతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ పురస్కారం లభించినందుకు తన కన్నా 'శప్తభూమి' పాఠకులే ఎక్కువగా ఆనందానికి లోనవుతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.
మొదటినుంచీ తనకు అవార్డుల మీద ఎలాంటి ఆసక్తి లేదన్నారు. శప్తభూమి పాఠకులు ఆ నవల చదివిన తర్వాత వారి అనుభూతిని తనతో పంచుకుంటున్న సందర్భంలో తనకు అవార్డు స్పృహ కలిగిందని అందుకే ఈ అవార్డు పాఠకులకే అంకితం చేస్తున్నానన్నారు.
undefined
Also Read: బండి నారాయణ స్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
శప్తభూమి నవలకు తను ఉన్న పరిసర ప్రాంతాలే ప్రేరణ అని చెప్పుకొచ్చారు. తను కదురుకుంట పాఠశాలలో పనిచేసేటప్పుడు తన ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళే దారిలో చారిత్రక ఆనవాళ్ళు కనిపించేవని, ఆ శిధిలమైన సమాధులు, శకాలాల గురించి వాటి వెనుక కథలు తెలుసుకోవాలనె జిజ్ఞాస నవలా రచనకు దారి తీసిందని అన్నారు.
అవార్డు రావడం బాధ్యతను పెంచిందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ - ఏ అవార్డు కూడా తన బాధ్యతను పెంచదని, తనలోని రచనా శక్తే తన బాధ్యతను ఎప్పటికప్పుడు పెంచుతూ రాయలసీమ కోసం పనిచేసేలా చేస్తుందని అన్నారు.
రాయలసీమ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా మరింత ముందుకు పోవాలని అందుకు తను రచయితగా నిరంతరం కృషి చేస్తుంటానని బండి నారాయణస్వామి చెప్పారు.