అయిత అనిత తెలుగు కవిత: ప్రేమ కుటీరం

By telugu team  |  First Published Nov 25, 2020, 10:24 AM IST

ఒకే గమ్యమై సాగే జీవనప్రస్థానంలోని మాధుర్యాన్ని అయిత అనిత 'ప్రేమ కుటీరం'లో వినిపిస్తున్నారు. చదవండి.


పొరపచ్చాల గుళకరాళ్లను ఏరిపారేస్తూ
అవగాహన రహదారిలో
ఇచ్ఛగా సాగే జీవనయానం!

అనురాగ పచ్చికబయళ్లను పెంచుతూ
కళల లోగిల్లలో సేదరీరే అనుభూతుల విరివనం!

Latest Videos

సహకారపు సారాన్ని ప్రోదిచేస్తూ
అనురాగ పరిమళాలను ఆఘ్రాణిస్తూ
చేదోడు వాదోడుగా మెలిగే సంసారక్షేత్రం!

అరమరికల్లేని బంధాలకు ప్రాణంపోస్తూ
ఆత్మీయతల వరమిచ్చే అపురూపధామం!

ఒకరికి ఒకరై జీవిస్తూ
ఆశల ఎరువుతో 
ఆశయాల సుమాలను పూయించే బృందావనం!

మమతలమేఘాలను కమ్ముకొని
మమకారపు సొనను వర్షించే ఆకాశసౌధం మాప్రేమకుటీరం!

ఆత్మీయతలను సమ్మిళితం చేసి
ఆశయాలను సృజిస్తూ
ఒకే గమ్యమై సాగే జీవనప్రస్థానం
మా సరిగమల సంగీతమాధుర్యం!

click me!