సిరిసిల్ల సిఐ అక్రమ లీలల బాగోతం??

By telugu teamFirst Published Oct 7, 2019, 10:32 AM IST
Highlights

సిరిసిల్ల సిఐ శ్రీనివాస చౌదరి ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఎస్పీకి, మంత్రికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 

కరీంనగర్: సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ నియోజకవర్గం. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి. రాష్ట్ర పరిపాలన అతని కనుసన్నల్లోనే నడుస్తున్నదంటే అతిశయోక్తి కాదేమో...!! ఎందుకంటే అతను కేటీఆర్.. మరి అంతటి వ్యక్తికి సొంత నియోజకవర్గంలో ఎం జరుగుతుందో తెలియకపోవటం నిజంగా ఆశ్చర్యమే మరి. సాధారణంగా నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా నియోజకవర్గ ఎమ్మెల్యేకి తెలియటం సర్వ సాధారణం. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎం జరిగినా కానీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలోని కీలక నేత నియోజవర్గం కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాల కన్ను నియోజకవర్గంపై ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇదివరకే నియోజకవర్గంలో జరిగిన నేరెళ్ల ఇసుక అక్రమ రవాణ సంఘటన కేటీఆర్ ను రాజకీయంగా చాల ఇబ్బందులకు గురిచేసింది. ఆ సంఘటన రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపింది. అప్పుడు ఆ సంఘటనలో సాక్ష్యాత్తు జిల్లా ఎస్పీనే బదిలీ చేసి, లోకల్ అధికారులను సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇప్పుడు కొత్తగా నియోజకవర్గంలో ఇసుక సెటిల్ మెంట్లు, భూ దందాల విషయంలో మళ్ళి కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ చౌదరి... నేను మంత్రి కేటీఆర్ కి దగ్గరని చెప్పుకునే స్థానిక నేత సహకారంతో భూ దందాలు, ఇసుక సెటిల్ మెంట్లు చేస్తూ అక్రమ వసూళ్ల దందాని మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లేలా చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే ఈ సిరిసిల్ల పట్టణ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇప్పటికే భూ దందాల పేరుతో పలువురిని బెదిరించటం, ఎవరైనా ఎదురు తిరిగితే రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకురావటం ఈ ఖాకికి అలవాటని... వైన్స్ షాపుల యజమానులు బెదిరించి డబ్బులు వసూలు చేయటం.. ఎదురుతిరిగిన వారిని వేధించటం ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఇతనిపై సిరిసిల్ల పట్టణంలో కోకొల్లలు ఉన్నాయి.  ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎన్నో ముడుపులు అందుకొని అక్రమ రవాణని యధేచ్చగా ప్రోత్సహించాడని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా కేటీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్న సిఐకి స్థానిక అధికార పార్టీ నేతల అండ ఉండటం కొసమెరుపు. 

ఏది ఏమైనా ఆ సదరు సిఐ దందాలు, దౌర్జన్యాలు మంత్రికి, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయా అని ప్రజలు గసగుసలాడుకుంటున్నారు. ఈయన గారు చేసే దందాలో పైస్థాయికి కూడా ఆ అమ్యామ్యాలు వెళ్తాయని అందుకే ఎవరు నోరు మెదపరని లోకల్ ప్రజల టాక్. మరి ఈ సిఐ శ్రీనివాస్ చౌదరి భాగోతం తెలిసి రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్ ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి!!

click me!