వేములవాడలో బంగారం పేరుతో బురిడీ.... బడా వ్యక్తుల ప్రమేయంతో పరారీలో నిందితుడు!!

By Siva KodatiFirst Published Oct 14, 2020, 9:53 PM IST
Highlights

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో జరిగిన ఒక మోసం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. వేములవాడలో పేరు మోసిన బడా బంగారం వ్యాపారి బొడ్ల అనిల్ అనే వ్యక్తి స్థానికంగా షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో జరిగిన ఒక మోసం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. వేములవాడలో పేరు మోసిన బడా బంగారం వ్యాపారి బొడ్ల అనిల్ అనే వ్యక్తి స్థానికంగా షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే అతనిది ఉన్నతమైన కుటుంబం కావటంతో చాలా మంది వ్యాపారులు కూడా అతన్ని నమ్మసాగారు.

క్రమంగా అనిల్ బంగారం వ్యాపారాన్ని విస్తరించాడు. బంగారం కొనే నెపంతో చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అంతేకాకుండా బంగారం అత్యంత తక్కువ ధరకే ఇప్పిస్తానని స్థానికులని నమ్మించి వారి నుండి పెద్ద మొత్తాలలో డబ్బులు తీసుకున్నాడు.

స్థానిక ప్రజలు కూడా అతను ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తూ ఉండటంతో బంగారం తక్కువ ధరకు వస్తుందనుకొని నమ్మారు. తీరా... ఒక 6 నెలలు వేచి చూసిన ప్రజలు తమ బంగారం ఏదని నిలదీయగా రెండు మూడు రోజుల్లో వస్తుందని చెప్పేవాడు.

డబ్బులు ఇచ్చిన వారందరు ఎప్పుడు అడిగినా అదే చెబుతూ వుండటంతో అనుమానం వచ్చి మాకు బంగారం అవసరం లేదని డబ్బులు ఇవ్వాలని నిలదీయగా రాత్రికి రాత్రే ఒక మహిళను తీసుకొని వేములవాడ నుండి తట్ట బుట్ట సర్దుకొని మాయమయ్యాడు.

బాధితులందరూ కలిసి వేములవాడ లోని అతనింటికి వెళ్లగా వారి తల్లిదండ్రులు ఉండటంతో వారిని నిలదీయగా మా కొడుకు చేసిన వాటికి మాకు సంబంధం లేదని చెప్పటంతో బాధితులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. 

దీంతో వెంటనే మోసపోయిన బాధితులందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులందరి డబ్బు మొత్తం నాలుగు కోట్లకు పైగా ఉండటంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు కేసును అప్పగించారని విశ్వసనీయ సమాచారం.

గత వారంగా టాస్క్ ఫోర్స్ వేములవాడ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు వెనకాల ఒక కీలక హోదాలో ఉన్న వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

ఆ కీలక వ్యక్తి ప్రమేయంతోనే నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై  టాస్కు ఫోర్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

click me!