కరీంనగర్ లో కరోనా కలకలం... ఒకే స్కూళ్లో 56మంది విద్యార్థులకు కరోనా

By Arun Kumar PFirst Published Oct 11, 2020, 11:55 AM IST
Highlights

 కరీంనగర్ జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏకంగా 56మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. 

కరీంనగర్: కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలలుగా మూతపడ్డ విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్రం నుండి అనుమతి లభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏకంగా 56మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారన్న వార్త అటు అధికారుల్లోనే కాదు ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తించింది.  

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరుగురు టీచర్లు, 50మంది విద్యార్థుకు కరోనా సోకింది. కొందరు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పాఠశాలలోని మొత్తం 206మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఆందులో 56మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ గురుకులంలో చదువుకునే పదవ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్థులకు గత కొద్ది రోజుల నుంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులు అభ్యర్థన మేరకే ఈ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. 

READ MORE  తెలంగాణలో కరోనా ఉధృతి: కొత్తగా 1811 పాజిటివ్ కేసులు, 9 మంది మృతి

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూనేవుంది. గత 24గంటల్లో ఈ వైరస్ బారిన 1,717 మంది తెలంగాణ వాసులు పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరుకుంది. 

ఇక ఇప్పటికే కరోనా బారిన పడ్డ వారిలో 2,103 మంది తాజాగా కోలుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకే కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 1,85,128కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్ర రికవరీ రేటు 87.29శాతంగా వుంటే దేశంలో అది 85.9శాతంగా వుంది. 

ఇక ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1222కి చేరింది. మరణాలు రేటు రాష్ట్రంలో 0.57శాతంగా వుంటే దేశవ్యాప్తంగా అది 1.5శాతంగా నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటిచింది. 

 ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 25,713 కేసులు వున్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24గంటల్లో మొత్తం 46,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో  రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన మొత్తం పరీక్షల సంఖ్య 35,47,051కి చేరింది. 

ఇక జిల్లాల వారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ(హైదరాబాద్)276, కరీంనగర్ 104, మేడ్చల్ 131, నల్గొండ 101, రంగారెడ్డి 132 కేసులు నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం 87, ఖమ్మం 82, నిజామాబాద్ 53, సంగారెడ్డి 59, సిద్దిపేట 85, సూర్యపేట 57, వరంగల్ అర్బన్ 59 కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగానే వుంది. 

click me!