హైదరాబాద్ నుండి వేములవాడకు చేరుకునేందుకు ప్రత్యేక హెలికాప్టర్ సేవలను తెలంగాణ టూరిజం శాఖ ప్రారంభించింది.
వేములవాడ: రాజన్నసిరిసిల్లా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు లాంఛనంగా ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. వేములవాడ రాజన్న క్షేత్రంతో పాటు శ్రీ రాజరాజేశ్వర జలాశయం అందాలను కూడా విహంగవీక్షణం చేసే అవకాశం భక్తులకు కలగనుంది.
ఈ సందర్భవగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమానేని రమేష్ మాట్లాడుతూ...తెలంగాణలో వేములవాడకు ఎంతో చరిత్ర ఉందన్నారు. వేములవాడపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద చూపించి అభివృద్ది చేస్తున్నారని అన్నారు.
శివరాత్రి పండుగకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి కేటీఆర్ సూచించారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవాళ్టి నుండి ప్రారంభమవుతాయని...
శివరాత్రి రోజున లక్ష మంది జాగారం చేస్తారని వారికోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శివార్చన కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
శివరాత్రి పండుగ సందర్భంగా ఈసారి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక హెలికాప్టర్ సదుపాయాలు కలిపిస్తున్నామని తెలిపారు. హెలికాప్టర్ ద్వారా వేములవాడ దర్శనం తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మిడ్ మానేరు చూసేందుకు కూడా ఏర్పాటు చేశామన్నారు.
టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుుతూ... మొన్ననే మేడారం జాతరను విజయవంతంగా జరుపుకున్నామన్నారు. మేడారం కు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ బాగా నడిపించామన్నారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ కు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ ను నడిపిస్తున్నట్లు వెల్లడించారు.
టూరిజంపై సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. వేములవాడ కు ఎన్నడూ కూడా హెలికాప్టర్ సర్వీస్ లు ఏర్పాటు చేయలేదన్నారు. జాగారం రోజు వేములవాడ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ లో వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు.
కేవలం వేములవాడలో రైడ్ చేయడానికి రూ.3000, వేములవాడ నుండి మిడ్ మానేరు కు రూ.5500, హైదరాబాద్ నుండి వేములవాడ కు 30000 ప్లస్ జిఎస్టీధర నిర్ణయించినట్లు... బుకింగ్ కోసం 09400399999, 09880505905, 095444444693 నంబర్లను సంప్రదించాలని సూచించారు.