పేకాట కోసం సరిహద్దులు దాటారు... అయినా 176 మంది అరెస్ట్

By Arun Kumar PFirst Published Dec 27, 2019, 8:18 PM IST
Highlights

రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపెల్లి జిల్లాలో టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇందులో 176 పేకాటరాయుళ్లు పట్టుబట్టారు. వారినుండి భారీగా డబ్బులు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలోని  పెద్దపల్లి ,మంచిర్యాల  జిల్లాలో పేకాట ఆడుతున్న 176 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు ఆడుతున్న వారితో పాటు నిర్వహకులను అరెస్ట్ చేశారు. ఇలా పట్టుబడిని వారందరికి రామగుండం పోలీస్ కమీషనర్ ఆద్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. 

రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపెల్లి జిల్లాలో టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. పేకాట,గ్యాంబ్లింగ్ ను రామగుండం కమిషనరేట్ లో పూర్తిగా నిర్మూలి౦చాలనే ఉద్దేశంతో ప్రత్యేక దాడులు నిర్వహించినట్లు కమీషనర్ తెలిపారు.   ఇందుకోసం గత కొంత కాలంలో కమీషనరేట్ పరిధిలో లాడ్జ్,హోటల్స్, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తుల ఇండ్లతో  పాటు ఇతర  ప్రాంతాల్లో దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ దాడుల్లో  కొంతమంది రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివిధ రంగంలో పని చేస్తున్నటువంటి కొంత మంది కూడా పట్టుబడడం జరిగిందన్నారు. తెలంగాణ పోలీసులు పటిష్టమైన నిఘా ఉండడం వల్ల కొంతమంది ఇక్కడ కాకుండా రాష్ట్రాలు దాటి మహారాష్ట్ర లోని పేకాట స్ధావరాలకు తరలినట్లు... ఇలా ప్రతి రోజు సుమారు 40 వాహనాల వరకు వెళుతున్నట్లు సమాచారం వుందన్నారు. 

read more  మున్సిపల్ ఎన్నికపై కసరత్తు ... కొత్త పద్దతిలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక : మంత్రి గంగుల

అక్కడ పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నవారు  కూడా ఈ ప్రాంతం వారేనని తెలిపారు. కొందరు బ్రోకర్లను నియమించుకుని వారిని ప్రతి రోజు 5000/- వేల నుండి 10,000/- వేల వరకు ఇస్తూ వివిధ ప్రాంతాల నుండి వాహనాల్లో పేకాట ఆడేవారిని తరలించే ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇలా పక్క రాష్ట్రాలకు వెళ్లి పేకాట ఆడుతున్న వారి జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. 

ప్రవర్తన మార్చుకోక ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే  పి.డి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని సిపి హెచ్చరించారు.  ఈ దందాలో 20 మంది  ప్రధాన నిందితులను గుర్తించడం జరిగిందని... వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. వీరికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం జరుగుతుందని తెలిపారు.

అత్యాశకు పోయి జీవితాలు చిద్రం

 అధిక డబ్బులు వస్తాయి అనే ఆశతో ఆడటం ,ఆశపడి కష్టపడి సంపాదించినా డబ్బును పేకాటకి తగలేసి మోసపోతున్నారు. వీరుగాక రాజకీయ నాయకులు,వ్యాపారస్తులు, ఉద్యోగులు ,చదువుకున్న యువత ఈ ఈజీ మని గేమ్ మోజులో పడి అప్పులపాలు అవుతున్నారు. పేకాటలో డబ్బులు పోయిన వారు  జేబులు గుల్లచేసుకుంటూ ఆర్దిక ఇబ్బందులకు గురి అవుతూ కుటుంబాలలో తగాదాలు ఏర్పడుతూ సతమతమవుతూ అప్పుల పాలై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. 

పేకాటకు బానిసై జీవితం చిద్రం చేసుకుంటున్నారు. ఈ పేకాట, గ్యాంబ్లింగ్ ఆటలో బాధితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆశపడి వేలల్లో  డబ్బులు పెట్టి మోసపోతున్నారు .ఇంకొందరు డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అక్రమ దందాలకు ప్రత్యక్షంగాను మరియు  పరోక్షం సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు.వారితో మరల పేకాట ఆడమని సిపి ప్రతిజ్ఞ చేయించారు.    


 

click me!