
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోని టాప్ లీడర్లు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. అమెరికా అయితే, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామనీ, దీనికి పూర్తి బాధ్యత వహించేలా రష్యాపై చర్యలు తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక కార్యకలాపాలను ప్రారంభించడంపై పాశ్చాత్య శక్తులు ఈరోజు తీవ్రంగా స్పందించాయి.
ఉక్రెయిన్ కు మద్ధతు కొనసాగుతుంది: అమెరికా (US)
ఉక్రెయిన్‌కు తమ మద్దతును కొనసాగిస్తామనీ, సైనిక దాడికి ప్రపంచం ముందు రష్యాను బాధ్యులను చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఈ యుద్ధం రష్యా ప్రేరేపిత, అన్యాయమైన చర్యగా అభివర్ణించారు. "రష్యన్ సైనిక బలగాలచే ప్రేరేపించబడుతూ.. అన్యాయమైన దాడికి గురవుతున్న ఉక్రెయిన్ ప్రజలకు తాము అండగా ఉంటాం" అని బిడెన్ తెలిపారు. ఈ యుద్ధం కారణంగా సంభవించే మరణాలు, విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుందనీ, యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా ఉండి.. నిర్ణయాత్మక మార్గంలో ప్రతిస్పందిస్తాయనీ, ప్రపంచం ముందు రష్యాను జవాబుదారీగా ఉంచుతుందని బైడెన్ పేర్కొన్నారు.
పుతిన్ రక్తపాతాన్ని ఎంచుకున్నాడు: యూకే (UK)
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంతో ఆ దేశ అధ్యక్షుడు రక్తపాతాన్ని ఎంచుకున్నారనీ, ఈ దాడి నేపథ్యంలో తాము.. మిత్ర దేశాలు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాయని యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అన్నారు. ఉక్రెయిన్‌లో జరిగిన భయానక సంఘటనలకు తాను భయపడిపోయానని, తదుపరి చర్యలపై చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడానని జాన్సన్ పేర్కొన్నారు. "అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఈ అనూహ్య దాడిని ప్రారంభించడం ద్వారా రక్తపాతం మరియు విధ్వంస మార్గాన్ని ఎంచుకున్నారు. UK, మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి" అని బోరిస్ జాన్సన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.
రష్యా దాడి.. ప్రపంచ పునాదిని కదిలించింది: జపాన్ (Japan)
ఉక్రెయిన్‌పై రష్యా దాడి "అంతర్జాతీయ పునాదులను కదిలించింది" అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చొరబాటును తీవ్రంగా ఖండించారు. "తాజా రష్యా దండయాత్ర అంతర్జాతీయ ఆర్డర్ పునాదిని కదిలించింది, ఇది యథాతథ స్థితిని మార్చడానికి ఏకపక్ష ప్రయత్నాలను అనుమతించదు" అని దేశ భద్రతా మండలి సమావేశం తర్వాత మీడియాతో అన్నారు. "మేము రష్యా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము యునైటెడ్ స్టేట్స్‌తో సహా అంతర్జాతీయ సమాజంతో ప్రయత్నాలను సమన్వయం చేస్తాము. దీనిని వేగంగా పరిష్కరిస్తాము" అని తెలిపారు.
ఇది అన్యాయమైన దాడి: ఇటలీ (Italy)
ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి గురువారం ఉక్రెయిన్‌పై రష్యా దాడిని "అన్యాయమైనది మరియు సమర్థించలేనిది" అని విమర్శించారు. యూరప్, NATO తక్షణ ప్రతిస్పందనకు కృషి చేస్తున్నాయని చెప్పారు. "ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఇటాలియన్ ప్రభుత్వం ఖండిస్తోంది. ఇది అన్యాయమైనది మరియు సమర్థించలేనిది. ఈ నాటకీయ సమయంలో ఇటలీ ఉక్రేనియన్ ప్రజలకు మరియు సంస్థలకు దగ్గరగా ఉంది. ఐక్యత మరియు దృఢసంకల్పంతో తక్షణమే స్పందించడానికి మేము యూరోపియన్, NATO మిత్రదేశాలతో కలిసి పని చేస్తున్నాము" అని ఇటలీ ప్రధాని చెప్పారు.
రష్యా నిర్ణయాన్ని ఖండించిన ఫ్రాన్స్ (France)
ఉక్రెయిన్ పై యుద్ధం చేయాలనే రష్యా నిర్ణయంపై స్పందించిన ఫ్రాన్స్.. ఇది ఖండించదగిన చర్య అని పేర్కొంది. ఉక్రెయన్ మద్దతు కొనసాగుతుందని తెలిపింది.