ఇజ్రాయెల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. తాము యుద్దంలో ఉన్నామని ప్రకటించారు.
ఇజ్రాయెల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్ల వర్షం కురిపించారు. దీంతో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి భగ్గుమన్నాయి. తమదేశంపై రాకెట్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం.. ప్రతిదాడులకు దిగింది. ఇప్పటికే యుద్దానికి సిద్దమని ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ మిలిటెంట్లపై ‘‘ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్’’ను ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లతో దాడి చేసింది.
మరోవైపు హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ భారీ హెచ్చరికను జారీ చేసింది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో భద్రతా మంత్రివర్గ సమావేశం తర్వాత.. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ దాడిని ప్రారంభించడం ద్వారా హమాస్ తీవ్ర తప్పు చేసిందని అన్నారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ యుద్ధాన్ని ప్రారంభించిందని.. ఇజ్రాయెల్ గెలుస్తుందని ధీమాగా చెప్పారు.
undefined
ప్రస్తుత పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. తాము యుద్దంలో ఉన్నామని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ పౌరులారా.. మనం యుద్ధంలో ఉన్నాము. శత్రువు భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. మనం ఈ యుద్ధంలో గెలుస్తాము’’ అని ప్రధాని నెతన్యాహు చెప్పారు. శత్రువు ఇంతకు ముందెన్నడూ తెలియని ప్రతిస్పందనను ఎదుర్కొంటారని అన్నారు.
‘‘ఈరోజు ఉదయం హమాస్.. ఇజ్రాయెల్‌పై హంతక ఆకస్మిక దాడిని ప్రారంభించింది. మేము ఉదయం నుంచి దీనిని పరిశీలిస్తూనే ఉన్నాం. నేను భద్రతా వ్యవస్థ అధిపతులను సమావేశపరిచాను. చొరబడిన ఉగ్రవాదుల స్థావరాలను ప్రక్షాళన చేయమని నేను మొదట ఆదేశించాను.. ప్రస్తుతం ఈ ఆపరేషన్ జరుగుతోంది. అదే సమయంలో నేను విస్తృతమైన రిజర్వ్ సమీకరణకు, శత్రువుకు ఎన్నడూ తెలియని బలం, పరిధితో ప్రతీకార యుద్ధానికి ఆదేశించాను. శత్రువు తనకు ఎన్నడూ తెలియని మూల్యాన్ని చెల్లిస్తాడు. ఈలోగా సైన్యం సూచనలను, హోమ్ కమాండ్ సూచనలను ఖచ్చితంగా పాటించాలని నేను ఇజ్రాయెల్ పౌరులందరికీ పిలుపునిస్తున్నాను’’ అని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇక, ఈరోజు ఉదయం గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం.. దేశం దక్షిణ, మధ్య ప్రాంతాలలో ఒక గంటకు పైగా సైరన్లతో జనాలకు హెచ్చరికలు జారీచేసింది. బాంబు షెల్టర్ల దగ్గర ఉండమని ప్రజలను కోరింది. మిలిటెంట్ల చొరబాటుకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారని సైన్యం తెలిపింది. ఈ ప్రాంత ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామని సైన్యం పేర్కొంది. అయితే ఈ రాకెట్ల దాడుల వల్ల ఏ మేరకు నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ రాకెట్ల దాడుల్లో ఒక మహిళ మృతిచెందిందని వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలాఉంటే, అయితే.. గాజా స్ట్రిప్‌లో 2007 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధికారం చేపట్టింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని విధించింది. అప్పటి నుండి పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ అనేక విధ్వంసకర యుద్ధాలు చేశారు.