
ఉక్రెయిన్‌లోని (russia ukraine crisis) జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని (volodymyr zelensky) కుప్పకూల్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడులను తీవ్రతరం చేయాలని రష్యా సేనలను ఆయన ఆదేశించారు. అటు జెలెన్ స్కీని హతమార్చేందుకు వాగ్నార్ గ్రూప్ సహా కిరాయి హంతకులు రంగంలోకి దిగారని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడిని రక్షించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి. రష్యా దళాలు తమ నష్టాలను వీలైనంత త్వరగా పూడ్చుకొని ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తాయని అంచనావేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం పోరు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవాసంలో ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. పాలన నిర్వహించేందుకు వీలుగా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
అమెరికా నుంచి ఉక్రెయిన్ దళాలకు నిరంతరం ఆయుధాలు అందాల్సిన అవసరం ఉందని... అప్పుడే వాటి ప్రతిఘటన బలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మానవీయ, ఆయుధ సాయం అందించేందుకు 10 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్యాకేజీ కేటాయించాలని బైడెన్ సర్కారు కాంగ్రెస్‌ను కోరింది. ఉక్రెయిన్‌లో పోరాటం కొనసాగించాలంటే అధ్యక్షుడు జెలన్‌స్కీ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. సైన్యంలో , దేశ ప్రజల్లో ఆయనే నైతిక స్థైర్యం నింపాలి. జెలెన్‌స్కీ అవసరమైతే తన పాలన పోలెండ్ నుంచి నిర్వహించేలా ప్రవాస ప్రభుత్వానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని అమెరికాకు చెందిన అధికారి వెల్లడించారు.
మరోవైపు ... ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా(Russia) యుద్ధంలో నంబర్ వన్ టార్గెట్ తానే అని ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన కుటుంబం టార్గెట్‌గా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేశారు గానీ.. దేశం విడిచి వెళ్లి తలదాచుకోవడానికి ఆయన నిరాకరించారు. అమెరికా ఆయనకు ఆఫర్ చేసినా తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నా.. ఇప్పటి వరకు ఆయనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. మరో షాకింగ్ న్యూస్ ఏమంటే.. ఆ హత్యా ప్రయత్నాలను నిలువరించడానికి కూడా రష్యా ఇంటెలిజెన్స్‌లోని కొన్ని వర్గాల నుంచే అందిందని సమాచారం.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు(Murder Attempt) జరిగాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపేయడానికి రెండు గ్రూపులు వాగ్నర్ గ్రూప్, చెచెన్ రెబెల్స్‌ను పురమాయించినట్టు సమాచారం. అయితే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపేయడానికి బయల్దేరిన చెచెన్ గ్రూపు గురించి రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్‌బీ)లోని కొన్ని వర్గాలే ఉక్రెయిన్ అధికారులను అప్రమత్తం చేసినట్టు వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. అయితే, ఆ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌లో యుద్ధాన్ని వ్యతిరేకించేవారూ ఉన్నట్టు సమాచారం. ఆ వర్గాల నుంచే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్యాయత్నం గురించి సమాచారాన్ని లీక్ చేశారని తెలిసింది.