లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం

By sivanagaprasad KodatiFirst Published Oct 27, 2019, 11:20 AM IST
Highlights

ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది

ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాగ్ధాదీని మట్టుబెట్టేందుకే అమెరికా సైన్యం ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించాయని తెలుస్తోంది.

అనుకున్న లక్ష్యం నేరవేరినట్లుగా సైనిక ఉన్నతాధికారులు వైట్ హౌస్‌కు సమాచారం అందించారని ‘‘ న్యూస్ వీక్’’ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అబు బకర్‌ను అంతం చేసేందుకు అత్యున్నత స్థాయిలో పథకరచన చేశారని.. ఈ ఆపరేషన్‌కు ట్రంప్ సైతం ఆమోదముద్ర వేసినట్లుగా కథనంలో పేర్కొంది.

దీనికి బలాన్ని చేకూరుస్తూ ‘‘ ఇప్పుడే ఒక పెద్ద సంఘటన’’ జరిగిందంటూ ట్రంప్ ట్వీట్ చేయడం పలు అనుమానాలను కలిగిస్తోంది. వాయువ్య సిరియాలో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది.

అక్కడ పదుల సంఖ్యలో ఉగ్రవాదుల మృతదేహాలు పడివుండటం.. గుర్తు పెట్టేందుకు వీలు లేకపోవడంతో బాగ్ధాదీ మృతదేహాన్ని గుర్తించాలంటే డీఎన్ఏ, బయోమెట్రిక్ పరీక్షలు నిర్వహించాల్సి వుంది. దాడులు జరుగుతున్న సమయంలో అబు బకర్ ఆత్మాహుతి దాడికి యత్నించాడని సైన్యం తెలిపింది. 

Something very big has just happened!

బాగ్ధాదీ అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్ -బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్ధాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

21వ శతాబ్ధం ఆరంభంలో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ తదితర కారణాలతో ఇతను తన నగరంలో ‘జైష్ హల్ అల్ సున్నా అల్-జమా’’అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను స్థాపించాడు.

ఆ తర్వాత 2004 ఫిబ్రవరిలో అమెరికా బలగాలు ఫలుజాలో బాగ్ధాదీని అదుపులోకి తీసుకుని.. బాగ్ధాద్‌లోని ‘‘క్యాంప్ బుక్కా’’ జైలుకు తరలించి డిసెంబర్‌లో విడుదల చేశాయి. జైలు నుంచి విడుదలయ్యాక మరింత రెచ్చిపోయిన అబు బకర్ 2006లో మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఏకం చేసి ‘‘ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్‌’’గా ఏర్పాటు చేశాడు.

తదనంతర కాలంలో సిరియా అంతర్యుద్ధంలోకి ప్రవేశించిన ఈ సంస్థ.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో పట్టు సాధించింది. 2013 ఏప్రిల్‌లో అక్కడి అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థను తనలో కలుపుకుని ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’’గా మార్చుకుంది.  

click me!