కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు అగ్ర రాజ్యాలు సైతం కుప్ప కూలిపోతున్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతో పాటు రాజులను ప్రధానులను కూడా వదిలి పెట్టట్లేదు.
ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని యావత్ ప్రపంచం కోరుకుంది.
ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. అయితే.. ప్రధాని బోరిస్ జాన్సన్ భార్య ప్రస్తుతం గర్భిణీ. ఆమెకు కూడా ఇటీవల కరోనా లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో.. బ్రిటన్ ప్రధాని దంపతులను ఉద్దేశించి.. అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ లేఖ రాశారు.
వైట్ హౌస్ నుంచి బ్రిటన్ ప్రధాని దంపతులకు ఆమె లేఖ పంపారు. వారి ఆరోగ్యం కోసం తమ అమెరికా దేశమంతా ప్రార్థనలు చేస్తోందని.. త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె పేర్కొన్నారు. కాగా.. మెలానియా పంపిన సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం కరోనా మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతి గంటకు 107మంది ప్రాణాలు వదులుతున్నారు. ప్రతి 24గంటలకు 2వేలకు మించి మరణాలు నమోదౌతున్నాయి. కాగా.. ఇప్పటి వరకు అక్కడ 7లక్షల మందికి వైరస్ సోకగా.. దాదాపు 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు.