పాకిస్తాన్ విమానాలను వెలేస్తున్న ప్రపంచం: ఇప్పుడు అమెరికా వంతు

By Siva KodatiFirst Published Jul 10, 2020, 2:40 PM IST
Highlights

పాకిస్తాన్‌ను నకిలీ పైలట్ లైసెన్సుల వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్... పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే

పాకిస్తాన్‌ను నకిలీ పైలట్ లైసెన్సుల వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్... పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా సైతం ఇదే బాటలో నడిచింది.

పాకిస్తాన్‌ నుంచి అమెరికాకు నడిచే పీఐఏ చార్టర్డ్ విమానాల అనుమతిని రద్దు చేస్తున్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రకటించింది. మన దాయాది దేశంలో సగానికిపైగా పైలట్ లైసెన్సులు నకిలీవని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కూడా పీఐఏ విమాన సర్వీసులపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పీఐఏ సర్వీసులు అమెరికాకు రాకుండా నిషేధించింది. అయితే దిద్దుబాటు చర్యల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని పీఐఏ ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు జారీ అయిన లైసెన్సుల్లో ఎక్కువ శాతం చెల్లవని అక్కడి ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. దేశంలో 860 క్రియాశీల పైలట్ లైసెన్సులుండగా వీటిలో దాదాపు 262 లైసెన్సులు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపింది.

దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఏకంగా పాకిస్తాన్ పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. ఒక్క పీఐఏలోనే మూడో వంతు పైలట్లు తప్పుడు విధానంలో లైసెన్సులు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పీఐఏలో దాదాపు 434 మంది పైలట్లు ఉండగా, వీరిలో 141 లైసెన్సులను పాకిస్తాన్ విమానయాన శాఖ ఇప్పటికే రద్దు చేసింది. కాగా మే నెలలో పీఐఏకు చెందిన విమానం కరాచీ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కుప్పకూలడంతో 97 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 
 

click me!