రైతుల ఆందోళన: భారత్- పాకిస్తాన్ అంటూ కన్‌ఫ్యూజైన బ్రిటన్ ప్రధాని

By Siva KodatiFirst Published Dec 10, 2020, 3:26 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ మద్ధతు లభిస్తోంది.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గత కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ మద్ధతు లభిస్తోంది. వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సహా దేశాధినేతలు  సైతం రైతులకు జై కొట్టారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగంగానే తన మద్ధతు తెలిపారు. 

అయితే ఈ ఆందోళనపై బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ కాస్త గందరగోళానికి గురైనట్లు కనిపిస్తోంది. ఈ విషయమై యూకే పార్లమెంట్‌లో స్పందించిన జాన్సన్‌.. ‘భారత్‌-పాకిస్థాన్‌ మధ్య వివాదంపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అయితే, అది వారి ద్వైపాక్షిక అంశం అంటూ జాన్సన్ వ్యాఖ్యానించడంతో సభ్యులు అవాక్కయ్యారు. 

వివరాల్లోకి వెళితే.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై బ్రిటన్‌ ప్రతిపక్ష ఎంపీ తన్మన్‌జీత్‌ సింగ్‌ పార్లమెంట్‌లో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అన్నదాతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సరికాదన్నారు.

అన్నం పెట్టే రైతులపైనే ప్రభుత్వాలు లాఠీఛార్జ్‌ చేయించడం, వారిని అణగదొక్కడం హృదయ విదారకరమని తన్మన్‌జిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మన ప్రధాని (బోరిస్‌ జాన్సన్‌).. భారత ప్రధానితో మాట్లాడుతారా? మనం ఆందోళన చెందుతున్న విషయాన్ని చెప్పి.. సమస్యను త్వరగా పరిష్కరించమని కోరతారా? అంటూ బ్రిటన్‌ ప్రధానిని తన్మన్‌జీత్‌ ప్రశ్నించారు.   

దీనికి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బదులిస్తూ.. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వివాదంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. అయితే, అది వారి ద్వైపాక్షిక అంశం. రెండు ప్రభుత్వాలు కలిసి పరిష్కరించుకోవాలన్నారు. దీంతో తన్మన్‌జీత్‌ సింగ్‌ సహా మిగిలిన సభ్యులు అవాక్కయ్యారు.

రైతుల విషయంపై బోరిస్‌ పొరబడిన వీడియోను తన్మన్‌జీత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. యావత్‌ ప్రపంచం మాట్లాడుకుంటున్న ఓ పెద్ద అంశంపై ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పొరబడటం ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రధాని దేని గురించి స్పందిస్తున్నారో కాస్త తెలుసుకోవాలని చురకలంటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

click me!