కనీసం ఒక మీటర్ ఎత్తుతో సునామీ అలలు జపాన్ తీరాన్ని తాకుతున్నాయి. 7.5 తీవ్రతతో భూమి కంపించడంతో రాకాసి అలలు వస్తున్నాయి. పలు చోట్ల అగ్రిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇళ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమైపోయాయి. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు.
Japan Earthquake: ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తుంటే.. జపాన్ మాత్రం కల్లోల అంచుకు చేరుతున్నది. మిగితా దేశాల్లాగే జపాన్‌లోనూ ప్రజలు న్యూ ఇయర్ వేడుకల కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబాలూ కలుసుకున్నాయి. కొందరు పార్టీలో మునిగితే.. ఇంకొందరు ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లారు. కానీ, ఇంతలోనే పిడుగులాంటి వార్త.
జపాన్‌లో కనీసం 50 భూకంపాలు సంభవించాయి. అవి రిక్టర్ స్కేల్ పై 3 కంటే ఎక్కువ తీవ్రతనే నమోదు చేశాయి. అందులో ఒక భూకంపం ఏకంగా 7.6 తీవ్రతను నమోదు చేసుకుంది. ఇది జపాన్ తీర ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సునామీ అలలు ఎగసిపడ్డాయి. ఒక మీటర్ ఎత్తుతో ఈ రాకాసి అలలు తీరాన్ని తాకుతున్నాయి. భూకంపాలతో ఇళ్లు ధ్వంసం అయిపోయాయి. కొన్ని చోట్ల ఇల్లు నిప్పంటుకుని బూడిదైపోయాయి. చాలా చోట్ల హైవేలను మూసేశారు. బుల్లెట్ ట్రైన్‌లనూ నిలిపేశారు.
undefined
అతిపెద్ద భూకంపం సంభవించిన పది నిమిషాలకు తీరానికి పెద్ద ఎత్తున అలలు వచ్చాయి. ఇషికవా ప్రిఫెక్చర్‌లోని నోటో రీజియన్‌లో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో ఇది సంభవించింది.
దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు పరుగు పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న వారు వీలైనంత తొందరగా ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని జపాన్ పీఎం ఫుమియో కిషిదా ప్రజలను కోరారు. మీ ఇల్లు, మీ వస్తువులు మీకు చాలా విలువైనవని మేం అర్థం చేసుకోగలం. కానీ, వీటన్నింటి కంటే మీ ప్రాణాలు అమూల్యమైనవి. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీయండి’ అని ఓ టెలివిజన్ ప్రెజెంటర్ విజ్ఞప్తి చేశారు.
వజీమా పోర్టు వద్ద కనీసం 1.2 మీటర్ల ఎత్తుతో(4 అడుగులు)తో అలలు వస్తున్నాయి. జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ పెద్ద సునామీ అలలు వస్తున్నాయని, అవి ఐదు మీటర్ల ఎత్తు వరకు ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత మూడు మీటర్ల ఎత్తు వరకు ఉంటాయని హెచ్చరించింది.