తైవాన్ రైలు ప్రమాదం : సొరంగంలో పట్టాలు తప్పి.. 36మంది మృతి..

By AN TeluguFirst Published Apr 2, 2021, 12:48 PM IST
Highlights

తూర్పు తైవాన్‌లోని ఒక సొరంగంలో 350 మందితో వెల్తున్న రైలు పట్టాలు తప్పింది. దీంతో కనీసం 36 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

తూర్పు తైవాన్‌లోని ఒక సొరంగంలో 350 మందితో వెల్తున్న రైలు పట్టాలు తప్పింది. దీంతో కనీసం 36 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

టైటుంగ్ కు వెడుతున్న ఎనిమిది భోగీల ఈ రైలు శుక్రవారం ఉదయం హువాలియన్ కు ఉత్తరాన ఉన్న సొరంగంలోకి ప్రవేశించగానే ఈ ప్రమాదం జరిగింది. రైలు సొరంగంలోకి సగం వెళ్లగానే పట్టాలు తప్పడంతో భోగీలు సొరంగం గోడలకు కొట్టుకుని ప్రమాదం తీవ్రమయింది. 

దీంతో సహాయకసిబ్బంది లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని ప్రభుత్వం నడుపుతున్న కేంద్ర వార్తా సంస్థ అగ్నిమాపక విభాగాన్ని ఉటంకిస్తూ నివేదించింది.

ఇప్పటికే ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ తో సహా, 35 మంది ప్రయాణికులు మరణించినట్లు తైవాన్ ప్రీమియర్ సు-సెంగ్-చాంగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో 81 మంది గాయపడ్డారు, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఎనిమిది మంది ఇంకా భోగీల్లో చిక్కుకుపోయి ఉన్నారు. 

అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ మాత్రం సరిగ్గా పార్క్ చేయని ట్రక్ ఒకటి రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుపుతుంది. 

తైవాన్ విడుదల చేసిన ప్రమాద వీడియోల్లో "అందరూ క్యారేజ్ ఫోర్లో ఉన్నారా?" అని  సొరంగం లోపల నుండి ఒక మహిళ అరవడం వినబడుతుంది. ఈ వీడియోలో సొరంగం లోపల క్యారేజీలు విరిగిపోయి, చెల్లాచెదురుగా పడిపోయి దృశ్యాలు, ప్రయాణికుల సామాగ్రి, శిథిలాలు కనిపిస్తున్నాయి.

ఈ రైలు ప్రమాదంలో మేము వీలైనంత తొందరగా స్పందించి చర్యలు చేపట్టాం అని  తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ ట్విట్టర్లో తెలిపారు. "ఈ హృదయ విదారక సంఘటనలో అందరూ భద్రంగా బయటపడాలని, దానికోసం చేయాల్సిందంతా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

లాంగ్ వీకెండ్ కావడంతో సాంప్రదాయ టూంబ్ స్వీపింగ్ డే కోసం వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.తైవాన్ లోని పర్వత తూర్పు తీరం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం లాంగ్ వీకెండ్ కారణంగా వీరంతా ఇక్కడికి వస్తున్నారు. సుందరమైన టారోకో నేషనల్ పార్కుకు దగ్గర్లోనే ఈ ప్రమాదం జరిగింది. 

గత మూడు దశాబ్దాల్లో ఈ ద్వీపంలో జరిగిన  అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇది. 2018 లో ఈశాన్య తైవాన్‌లో రైలు పట్టాలు తప్పడంతో 18 మంది మరణించారు. 175 మంది గాయపడ్డారు.

click me!