భారత్‌లో ఉదయనిధి మాటల దుమారం.. సెప్టెంబర్ 3ను సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన యూఎస్ నగరం..

సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. ఇదిలాఉంటే, అమెరికాలోని ఒక నగరం  మాత్రం.. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా పాటించనున్నట్టుగా ప్రకటించింది.

Google News Follow Us

సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయం అనే భావనకు విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. పలు  ప్రతిపక్ష పార్టీలు కూడా ఉదయనిధికి మద్దతిస్తున్నాయి. దీంతో దేశంలో సనాతన ధర్మంపై చర్చ జరుగుతుంది. 

ఇదిలాఉంటే, అమెరికాలోని ఒక నగరం  మాత్రం.. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా పాటించనున్నట్టుగా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని కెంటకీలోని లూయిస్‌ విల్లే మేయర్ సెప్టెంబర్ 3ని నగరంలో సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించారు. లూయిస్‌ విల్లేలోని హిందూ దేవాలయం కెంటకీలో జరిగిన మహా కుంభా అభిషేకం వేడుకకు హాజరైన డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ ఈ అధికారిక ప్రకటనను చదివి వినిపించారు. 

ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు చిదానంద సరస్వతి, శ్రీశ్రీ రవిశంకర్‌, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జాక్వెలిన్‌ కోల్‌మన్‌, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక, సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేపై ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చినందుకు స్టాలిన్‌పై, ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచినందుకు ప్రియాంక్ ఖర్గేలకు కేసు నమోదు చేశారు.