తిరుగుబాటుదారులతో తాలిబాన్ల శాంతి చర్చ.. పంజ్‌షిర్‌కు 40 మంది ప్రతినిధులు

By telugu teamFirst Published Aug 25, 2021, 12:52 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో పంజ్‌షిర్‌ నుంచి తాలిబాన్లకు గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది. తాము యుద్ధాన్ని కాంక్షించడం లేదని, తమ విలువలు, హక్కులను గౌరవించి శాంతి చర్చలు జరిపితే సరేనని, లేదంటే యుద్దానికి వెనుకాడబోమని అహ్మద్ మసూద్, అమృల్లా సలేహ్ సారథ్యంలోని ప్రతిఘటనా శక్తులు స్పష్టం చేశాయి. ఈ తరుణంలో 40 మంది తాలిబాన్ ప్రతినిధులు తిరుగుబాటు శక్తులతో శాంతి చర్చలో పాల్గొన్నట్టు సమాచారం. అయితే, భేటీ ఫలితం అస్పష్టంగా ఉన్నది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లు పంజ్‌షిర్ ప్రావిన్స్‌ను తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది. పంజ్‌షిర్ ఇప్పటి వరకు విదేశీ బలగాలు లేదా తాలిబాన్లకు లొంగిన దాఖలా లేదు. ఇప్పటి వరకు స్వేచ్ఛా వాయువులనే పీల్చింది. తాలిబాన్లతో అవిశ్రాంత పోరాటం చేసి వారి చేతిలో మరణించిన పంజ్‌షిర్ సింగం అహ్మద్ షా మసూద్ తనయుడు మసూద్ ఇప్పుడు దేశ పౌరులకు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. తాలిబాన్లపై యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటుదారులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి తాలిబాన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇప్పటికే తాలిబాన్ల వైపు నుంచి 40 మంది ప్రతినిధులు పంజ్‌షిర్‌లోని ప్రతిఘటన శక్తులతో భేటీ అయినట్టు సమాచారం. కానీ, ఈ సమావేశ ఫలితాలపై స్పష్టత లేదు. సమగ్ర వివరాలు ఇంకా అందరాలేదు.

తాలిబాన్లు ఖొరాసాన్ ప్రజల విలువలను ఆమోదించాల్సిందేనని లేదంటే ప్రతిఘటనను ప్రకటించినట్టుగానే అర్థం చేసుకోవాలని తాలిబాన్ వ్యతిరేక గ్రూపు ట్వీట్ చేసింది. తమకు యుద్ధం ప్రియమేమీ కాదని, కానీ, తాలిబాన్లు తమ హక్కులను, అందరూ గౌరవించే వ్యవస్థను ఆమోదించాలని స్పష్టం చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అమృల్లా సలేహ్.. తాలిబాన్ల ఆక్రమం తర్వాత చట్టం ప్రకారం తానే దేశ అపద్ధర్మ అధ్యక్షుడిని అంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. మసూద్, సలేహ్ సంయుక్తంగా తాలిబాన్లను ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారు.

click me!