ఆఫ్గనిస్తాన్‌లో ఆడపిల్లలకు కొత్త రూల్ : పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ.. తాలిబన్ల హుకుం

By Siva KodatiFirst Published Nov 11, 2022, 6:20 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు మరో కొత్త రూల్ తీసుకొచ్చారు తాలిబన్లు. పార్కులు, జిమ్‌లలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కుల్లో సేద తీరుదామని భావిస్తున్న ఆడవాళ్లకు తాజా నిబంధన నిరాశకు గురిచేస్తోంది. 


ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు.. తమ నిరంకుశ విధానాలను కొనసాగిస్తున్నారు. గతంలో మాదిరిగా వుండమని, మహిళలకు స్వేచ్ఛను అందిస్తామని వారు చెప్పిన మాటలు నీటిపై రాతలే అయ్యాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. తాజాగా తాలిబన్లు మరో కఠిన నిబంధన తీసుకొచ్చారు. పార్కులు, జిమ్‌లలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. అలాగే అన్ని రకాల అమ్యూజ్‌మెంట్ పార్కుల్లోకి మహిళలు వెళ్లరాదని హుకుం జారీ చేశారు. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లో ఈ నిబంధన అమలవుతోంది. దీంతో విషయం తెలియకుండా పార్కుల్లోకి వెళ్లిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కుల్లో సేద తీరుదామని భావిస్తున్న ఆడవాళ్లకు తాజా నిబంధన నిరాశకు గురిచేస్తోంది. 

ఇకపోతే.. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నారు. ఈ ఏడాది జూలైలో బగ్లాన్ ప్రావిన్స్‌లోని అందరాబ్ జిల్లాలో ఒక యువకుడిని కాల్చి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని జిల్లాలోని మార్కెట్ దగ్గరకి తీసుకెళ్లి బహిరంగంగా ఉరితీశారు. ఈ ప‌రిణామం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఒక్క సారిగా ఉలిక్కిప‌డేలా చేసింది. 

స్థానిక మీడియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కసా తరాష్ ప్రాంతంలోని అందరాబ్‌లో నివసించే వ్య‌క్తి ఇంటికి స‌మీపంలోకి జూలై 20వ తేదీన తాలిబ‌న్లు వెళ్లారు. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని బ‌ల‌వంతం చేశారు. అనంత‌రం అత‌డిని కాల్చి చంపారు. అయితే అత‌డి భ‌వ‌నం ముందు గుమిగూడిన ప్రజలను కూడా తాలిబన్లు ఏరియల్ ఫైరింగ్ ద్వారా చెదరగొట్టారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఆ మృత‌దేహాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు బ‌హిరంగ మార్కెట్ కు తీసుకొచ్చి, వేలాడదీసి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డారు.

Also Read:దారుణం.. యువకుడిని షూట్ చేసి, బహిరంగ మర్కెట్ లో వేలాడదీసిన తాలిబన్లు..

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ (UNAMA) ఆఫ్ఘనిస్తాన్‌లో 10 నెలల తాలిబాన్ పాలన తీరు, ఏక‌ప‌క్ష హ‌త్య‌లకు సంబంధించిన నివేదికను స‌మ‌ర్పించిన ఒక రోజు త‌రువాత ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది.  గత 10 నెలల కాలంలో పది మందికి పైగా మాజీ భద్రతా దళాలు, సిబ్బందిని తాలిబ‌న్లు హ‌త‌మార్చారు.`

click me!