
జోహెన్నెస్‌బర్గ్: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) తొలిసారిగా దక్షిణాఫ్రికా(South Africa)లోనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడగా.. యూకే సహా యూరప్ దేశాలు వెంటనే ఆ దేశ ప్రయాణికులపై ఆంక్షలు(Restrictions) విధించాయి. ఆ వెంటనే ఇతర దేశాలూ వేగంగా ఆంక్షలకు ఉపక్రమించాయి. రోజుల వ్యవధిలోనే ఇతర దేశాలకూ ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. అలాంటి దక్షిణాఫ్రికా దేశమే వైరస్ కట్టడి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నది. కరోనా మహమ్మారితో కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. దేశంలో లాక్‌డౌన్ విధించాలని, క్వారంటైన్ నిబంధనలు విధించే ప్రణాళికలు ఏవీ వేయడం లేదు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్లే కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ వేరియంట్ లేదా కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ విధించడం, క్వారంటైన్ రూల్స్, కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, దక్షిణాఫ్రికా మాత్రం ఇలాంటి చర్యలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక పై ఫలితాలు ఇచ్చే సరైన మార్గంలో వెళ్లాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా కేసులపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. అలాగే, ఆరోగ్య వ్యవస్థపైనా ఒత్తిడి ఏ మేరకు ఉన్నదనే విషయాలను క్షుణ్ణంగా ఎప్పటికి అప్పుడు పర్యవేక్షించనున్నట్టు ఓ కథనం తెలిపింది.
కరోనా కట్టడి కోసం విధించే కఠిన నిబంధనలు పరోక్షంగా తీవ్ర ప్రభావాలను వేస్తున్నాయని దక్షిణాఫ్రికా దేశ వైద్య నిపుణులు జనవరి 9వ తేదీన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, సమాజ ఇతర అంశాలపై విధించే కఠిన చర్యలు పరోక్షంగా తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్టు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా విధిస్తున్న కఠిన నిబంధనలనే గుడ్డిగా ఇక్కడ అమలు చేయవద్దని సూచించారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఆ చర్యలు మంచి ఫలితాలు ఇవ్వలేవని తెలిపారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ నాలుగో వేవ్ నడుస్తున్నది. దక్షిణాఫ్రికా తీసుకుంటున్న ఈ కొత్త తరహా పంథా ప్రపంచ దేశాలకు పూర్తిగా భిన్నమనవి. ఇదే తరహా నిర్ణయాలను అమలు చేయడానికి యూకే కూడా యోచిస్తున్నట్టు తెలిసింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో క్వారంటైన సమయాన్ని వారం రోజుల నుంచి 5 రోజులు కుదిస్తూ యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం వస్తోంది.
కరోనా ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ప్రధాని Boris Johnsonఉన్నారని, లీగల్ గా చర్యలు తీసుకోవడం వలన కరోనాకేసులు తగ్గుతాయని అనుకోవడం లేదని, ప్రత్యామ్నాయంగా కోవిడ్ ను కట్టడి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా ఆంక్షలపై ఇప్పటికే Britain లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది.