
Russia Defence Ministry Fire: మాస్కోకు వాయువ్యంగా 160 కిమీ (100 మైళ్లు) దూరంలో ఉన్న రష్యాలోని ట్వెర్‌లోని రక్షణ పరిశోధనా కేంద్రంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 27 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నామని.. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి కారణమేమిటనే దానిపై అధికారిక సమాచారం లేదు.
రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఈ సంస్థ ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్సెస్ సెంట్రల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే భవనంలోని పైమూడు ఫ్లోర్లకు కూడా వ్యాపించింది. దీంతో అందులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అధికారుల సూచనల మేరకు భవనం కిటీకల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు.. ఈ దుర్ఘటనకు కారణం పాతబడిన వైరింగే అని స్థానిక మీడియా భావిస్తోంది. ఈ భవనంలో ప్రధానంగా వాయుసేన సాంకేతికత అభివృద్దికి సంబందించిన పరిశోధనలు జరుగుతుంటాయి. భవనం నుండి ప్రజలను రక్షించి, స్థలం నుండి ఖాళీ చేయించినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఘటన తర్వాత కనీసం 30 మంది వైద్య సహాయం కోరినట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రష్యా బుధవారం తన సర్మత్ సూపర్-హెవీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత రోజే.. ఈ పరిణామం చోటు చేసుకుంది, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. బాహ్య ముప్పుల నుండి రష్యా భద్రతకు భరోసా ఇస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో పుతిన్ తన కొత్త ఆయుధాగారంతో ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపాడు. ఈ క్షిపణి ప్రయోగం ద్వారా ప్రపంచం దేశాలకు రష్యా తన సామర్థ్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేసింది.
కొత్త క్షిపణి 'అత్యున్నత వ్యూహాత్మక , సాంకేతిక లక్షణాలను ఎలా కలిగి ఉందో వివరిస్తూ, రష్యా అధ్యక్షుడు సర్మత్ క్షిపణి ఆధునిక మార్గాలను అధిగమించగలదని పంచుకున్నారు. ఈ క్షిపణికి ప్రపంచంలో ఎలాంటి సారూప్యతలు లేవనీ, రాబోయే రోజుల్లో పోటీలేదని పుతిన్ వెల్లడించాడు. ఈ క్షిపణి తన సాయుధ దళాల పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రత్యేకమైన ఆయుధమని తెలిపారు. ఈ క్షిపణి ప్రయోగంతో పరోక్షంగా ప్రపంచ దేశాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.