
Russia Ukraine war : ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పటికే ఆ దేశ రూపురేఖలు పూర్తిగా మారాయి. చాలా నగరాలు ఎటూ చూసనా శిథిలాలను తలపిస్తున్నాయి. రష్యా దాడుల్లో ఆగ్నేయ నౌకాశ్రయ నగరమైన మారియుపోల్ పూర్తిగా ధ్వంసమైందని, అక్కడ ఇంకా మిగిలిందేమీ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు లోడిమిర్ జెలెన్స్‌కీ అన్నారు. సామాన్య పౌరుల నివాసాలను సైతం రష్యా ధ్వసం చేసిందన్నారు. మరీ ముఖ్యంగా దేశంలోని ఆరోగ్య, వైద్య వ్యవస్థలను సైతం టార్గెట్ చేసుకుని రష్యా దాడులకు తెగబడుతోందని తెలిపారు. తమ దేశంలోని మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దాదాపు 400కు పైగా ఆస్పత్రులను, మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ మెడికల్ ఛారిటీ గ్రూపును ఉద్దేశించి జెలెన్‌స్కీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రష్యా విధ్వంసకాండ కారణంగా క్యాన్సర్ రోగులకు మందులు, డయాబెటిస్ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులో లేకుండా పోయాయని, వైద్యులు సర్జరీలు కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. డోనెట్స్క్ ప్రాంత గవర్నర్ పావ్లో కైరిలెంకో మాట్లాడుతూ.. క్రమాటోర్స్క్ పట్టణంలో భారీ షెల్లింగ్‌లో 25 మంది గాయపడ్డారని, ఇది గత నెలలో రైల్వే స్టేషన్ పేలుడులో 50 మందికి పైగా మరణించారని తెలిపారు. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ తో పాటు రష్యాకు సైతం పెద్దమొత్తంలోనే నష్టం జరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ యుద్ధంతో రష్యా దాదాపు 25,000 సైనికులు, 1100కుపైగా యుద్ధ ట్యాంకులను నష్ట పోయిందని ఉక్రెయిన్ పేర్కొంది.
ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి 24న దాడిని ప్రారంభించింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం శుక్రవారం నాటికి 72వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రష్యాకు జరిగిన నష్టం వివరాలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడిస్తూ.. రష్యా ఇప్పటి వరకు 24,900 సైనికులు, 1,110 ట్యాంకులు, 199 యుద్ధ విమానాలను కోల్పోయిందన్నారు. అలాగే 155 హెలికాప్టర్లు, 2,686 సైనిక వాహనాలు, 502 ఆర్టిలరీ వ్యవస్థలు, 1,900 ఇతర వాహనాలు, ఇంధన ట్యాంకులను రష్యా నష్టపోయిందని చెప్పారు. ఉక్రెయిన్ లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే వందల సంఖ్యలో మృతులతో కూడిన సామూహిక ఖననాలు వెలుగుచూడటం అక్కడి మారణకాండకు అద్దం పడుతోంది. తాజాగా వెలువడుతున్న రిపోర్టుల ప్రకారం.. మరియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్ వద్ద వరుసగా రెండో రోజు కూడా ఉక్రెయిన్-రష్యా సైనికుల మధ్య భీకర పోరాటం జరిగిందని బ్రిటన్ మిలిటరీ నిఘా సంస్థ పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది.
ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న దాడుల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. అణుబాంబుల ప్రస్తావన రావడం పై కూడా అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిండమే కాకుండా ఐక్యరాజ్యసమతి వ్యవహార నిబంధనలను, దాని ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిచడమేనని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నొక్కి చెప్పారు.