
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడి ఆపడం లేదు. పుతిన్ (putin) సైన్యానికి ఉక్రెయిన్ బలగాలు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. దీంతో రెండు వైపులా తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. యుద్జం ఆపాలని పలు దేశాలు చేసిన ప్రయత్నాలు పూర్తి విఫలం అయ్యాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు యూఎన్ (UN) భద్రతా మండలిలో ప్రవేశపపెట్టిన తీర్మాణం ఆమోదం పొందినా.. దానిని రష్యా తనకున్న వీటో అధికారంతో రద్దు చేసింది. ఈ ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.
రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ లో వివిధ దేశాలకు చెందిన పౌరులు, విద్యార్థులు చిక్కుకున్నారు. ఇందులో మన ఇండియాకు చెందిన స్టూడెంట్లు కూడా ఉన్నారు. వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా (operation ganga) పేరిట ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఇప్పటి వరకు 48 తరలింపు విమానాల ద్వారా దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చామని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. మిగితా వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
తూర్పు ఉక్రెయిన్ లో ఇంకా అనేక మంది స్టూడెంట్లు చిక్కుకొని ఉన్నారు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ (Kharkiv)లో ఎంతో మంది స్టూడెంట్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారి దీన స్థితిని వివరిస్తూ స్టూడెంట్లు పోస్టు చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. వారి వద్ద కనీస అవసరాలు తీర్చుకునే వస్తువులు కూడా లేవు. చుట్టు పక్కల ప్రతీ 20 నిమిషాలకు ఒక సారి బాంబు పేలుతున్నాయని ఆ వీడియోల్లో స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున స్పందించింది. ధైర్యంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని చెప్పింది. స్టూడెంట్లను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఎంబసీ (indian embassy) ఆ స్టూడెంట్లను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసింది. ఖార్కివ్‌లోని పిసోచిన్ నుండి 298 మంది భారతీయ విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. రష్యా, ఉక్రేనియన్ దళాల మధ్య ఖార్కివ్ లోనే తీవ్రంగా ఘర్షణ జరుగుతోంది. ‘‘పిసోచిన్ (Pisochyn)లోని మా 298 మంది విద్యార్థులను చేరదీస్తున్నాము. బస్సులు మార్గంలో ఏర్పాటు చేశాం. త్వరలోనే అవి వస్తాయని భావిస్తున్నాం. దయచేసి అన్ని భద్రతా సూచనలు, జాగ్రత్తలను అనుసరించండి. సురక్షితంగా ఉండండి, ధైర్యంతో ఉండండి ’’ అని ఇండియన్ ఎంబసీ ఒక ట్వీట్ లో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఖార్కివ్ నుండి సురక్షితంగా తప్పించుకోగలిగిన భారత పౌరుడు మీడియాతో మాట్లాడారు. చాలా మంది విద్యార్థులు ఇంకా ఘర్షణ జరుగుతున్న ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారని చెప్పారు. ‘‘ చాలామంది విద్యార్థులు ఇప్పటికీ ఖార్కివ్‌లో చిక్కుకున్నారు. బాంబు దాడులు, షెల్లింగ్‌ల మధ్య మేము మార్చి 1న ఉక్రెయిన్ నుండి బయలుదేరాము. పోలాండ్ సరిహద్దు దాటిన తర్వాత భారత ప్రభుత్వం మాకు సహాయం అందించింది’’ అని ఖార్కివ్ నుండి తప్పించుకొని పోలాండ్‌లోని ర్జెస్జో చేరుకున్న ప్రత్యూష్ చౌరాసియా తెలిపారు.