
సాధారణంగా నగరాల్లో బాల్కనీలో లేదా టెర్రస్‌పైన బట్టల ఆరబెడుతుంటారు. కానీ అక్కడ మాత్రం బాల్కనీలో బట్టలు ఆరబెట్టవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్‌మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని హెచ్చరిక జారీ చేశారు. ఇటువంటి చర్యల వల్ల నగర సౌందర్యం దెబ్బతింటాయని వారు చెబుతున్నారు. అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు.
బాల్కనీలలో బట్టలు ఆరబెట్టడితే 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ. 20,000 భారతీయ) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని అధికారులు చెప్పారు. మున్సిపాలిటీ ప్రకారం.. నగరాన్ని సౌందర్యంగా ఉంచడం, బట్టలను అపరిశుభ్రంగా ఎండబెట్టడం నిలిపివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలోనే ఇందుకు సంబంధించి నివాసితులను హెచ్చరించాం. ఇందుకు సంబంధించిన ప్రాముఖ్యతపై నివాసితులకు అవగాహన కల్పించేందుకు ఈ హెచ్చరికను జారీ చేశాం.
అందుకే లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఈ విషయంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.