Turkey: టర్కీ అధ్యక్షుడిగా మరోసారి ఎర్డోగన్.. మూడో దశాబ్దంలోకి పాలన

By Mahesh KFirst Published May 29, 2023, 1:39 PM IST
Highlights

టర్కీ అధ్యక్షుడిగా మరోసారి రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ అధికారంలోకి వచ్చారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఎర్డోగన్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 52 శాతం ఓట్లు గెలుచుకున్న ఎర్డోగన్ విజయం సాధించినట్టు ఎన్నికల బోర్డు చీఫ్ ధ్రువీకరించారు.
 

న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఆ దేశ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ మరోసారి ఎన్నికయ్యారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆయన మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన అథారిటేరియన్ పాలన మూడో దశాబ్దంలోకి వెళ్లుతున్నది. ద్రవ్యోల్బణం పతనం కావడం, భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలోనూ ఆయనే మరోసారి అధికారంలోకి రావడం గమనార్హం.

జాతీయవాద వాదనలతో ప్రజలను ఆకర్షించిన ఎర్డోగన్ పై విభజనకారుడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫలితాలు టర్కీ సహా ఇతర దేశాలపైనా ప్రభావం వేయనున్నాయి. ఖండాంతర దేశమైన టర్కీ నాటోలో కీలక పాత్ర పోషిస్తున్నది.

99 శాతం బ్యాలెట్ బాక్స్‌లు తెరిచిన తర్వాత 52 శాతం ఓట్లు ఎర్డోగన్‌కు 48 శాతం ఓట్లు ఆయన ప్రత్యర్థి కెమాల్ కిలిక్‌డరోగ్లుకు పడ్డాయి. అధికారిక ఫలితాలు రాలేవు. కానీ, అధికార మీడియా ఏజెన్సీ.. రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ విజయం సాధించిందని స్పష్టం చేసింది. టర్కీ ఎన్నికల బోర్డు చీఫ్ కూడా ఎర్డోగన్ విజయాన్ని ధ్రువీకరించారు.

ఈ విజయం టర్కీ ప్రజల విజయం అని, తమపై నమ్మకం ఉంచి మరో ఐదేళ్ల అధికారానికి అవకాశమిచ్చిన ప్రజలకు ఎర్డోగన్ ధన్యవాదాలు తెలిపారు. టర్కీ ప్రజలను ఐక్యంగా ఆయన పేర్కొన్నా.. అదే ప్రసంగంలో ప్రత్యర్థి కెమల్‌, ఆయన వర్గీయులను, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలను వేరు చేసి మాట్లాడారు. బై బై బై కెమాల్ అంటూ వ్యంగ్యం పలికారు. భూకంపం తాకిడి ప్రాంతాలే తమ ప్రథమ ప్రాధాన్యమని వివరించారు. అలాగే, సిరియా శరణార్థులపైనా కామెంట్ చేశారు. సిరియాలో తమ అధీనంలో ఉన్న ప్రాంతాలకు టర్కీలోని సిరియా శరణార్థులను పంపే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

ప్రత్యర్థి కెమాల్‌కు టెర్రరిస్టుల మద్దతు ఉన్నదని క్యాంపెయిన్‌లో ఆరోపణలు చేశారు. 

ఎర్డోగన్ తీసుకున్న దూకుడు ఆర్థిక నిర్ణయాలతో ధరలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. లివింగ్ కాస్ట్ భారీగా పెరిగింది. భూకంప సమయంలోనూ ప్రభుత్వం అలసత్వం వహించిందని, ఫలితంగా సుమారు 50 వేల మంది మరణించారనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read: హైదరాబాద్ శివారు లో యువకుడి దారుణ హత్య.. గుర్తు పట్టకుండా దుస్తులు తీసేసి....

కాగా, కెమాల్ మాత్రం ఎర్డోగన్ విజయంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మార్పును కోరుకున్నారని, కానీ, అధికార యంత్రాంగం అంతా ఎర్డోగన్ కోసం పని చేశాయని ఆరోపించారు. 

తాను అధికారంలోకి వస్తే ఎర్డోగన్ నిర్ణయాలను వెనక్కి తీసుకెళ్లి ధరలను అదుపులోకి తెస్తానని హామీ ఇచ్చారు. జాతీయవాదులనూ ఆకర్షించడానికి.. శరణార్థులనూ వెనక్కి పంపిస్తాననే కామెంట్ చేశారు.

ఎర్డోగన్ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగింది. దేశంలో ఇస్లాం స్థాయిని పంచారని, ప్రపంచ దేశాల్లోనూ టర్కీకి ప్రాధాన్యతను పెంచారని ఎర్డోగన్ పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభ ముప్పును ఎర్డోగన్ తప్పించారు. ఎర్డోగన్ సంప్రదింపులు చేసి ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులకు రూట్ క్లియర్ చేశారు.

click me!