ప్రధాని మోడీకి పుతిన్‌ ఫోన్.. ఏం మాట్లాడారంటే..? 

By Rajesh KarampooriFirst Published Dec 16, 2022, 5:20 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్ సంభాషణ జరిపినట్లు రష్యా ప్రభుత్వ ఏజెన్సీ( TASS)ఒక ప్రకటనలో ధృవీకరించింది.అంతకుముందు.. ఇరువురు నేతలు సమర్‌కండ్‌లోని షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సమావేశంలో భేటీ అయ్యారు.ఇది యుద్ధ యుగం కాదని ఆ సమయంలో ప్రధాని మోదీ పుతిన్‌తో అన్నారు.

మోడీ-పుతిన్ ఫోన్ సంభాషణ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో  శుక్రవారం (డిసెంబర్ 16) ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో  సంభాషించారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వర్గాలు ధృవీకరించాయి. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా సమాచారాన్ని ఇచ్చింది. 

మోడీ-పుతిన్‌ల మధ్య ఇదే జరిగింది

ఇదిలా ఉంటే తాజాగా టెలిఫోన్ సంభాషణలో G-20కి భారతదేశం యొక్క ప్రస్తుత ఛైర్మన్‌షిప్ గురించి ప్రధాని మోదీ.. అధ్యక్షుడు పుతిన్‌కు వివరించారని , దాని ప్రధాన ప్రాధాన్యతలను హైలైట్ చేశారని PMO తెలిపింది. దీంతో పాటు ఈ ఏడాది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు భారతే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారు ఒకరితో ఒకరు నిరంతరం సంప్రదించడానికి అంగీకరించారని పీఎంఓ తెలిపింది. అలాగే.. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఈ ఏడాది ఇద్దరు నేతల మధ్య పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిగాయి.

రష్యా-ఉక్రెయిన్‌యుద్ధం 

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్యలో రష్యా అనేకసార్లు అణు దాడిని బెదిరించింది. ఇటీవల.. వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అణు దాడి చేస్తామని బెదిరించారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ పుతిన్ పరోక్షంగా బెదిరించడంతో మోదీ-పుతిన్ సమ్మిట్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను రష్యా ఖండించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించడంపై వచ్చిన కథనాలను రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తోసిపుచ్చింది.


కొన్ని నెలల క్రితం ఉజ్బకిస్తాన్ సమర్ కండ్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇంధన సహకారం, వాణిజ్యం , పెట్టుబడులు, రక్షణ , భద్రతా సహకారం , ఇతర కీలక రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల యొక్క అనేక అంశాలను సమీక్షించారు. ఆ సమయంలో ఇది యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. పీఎం నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ వివాదంపై మీరు నిరంతరం వ్యక్తపరిచే మీ ఆందోళనల గురించి మీ వైఖరి నాకు తెలుసునని అన్నారు. వీలైనంత త్వరగా దాన్ని ఆపేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

click me!