
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ల ఆహ్వానం మేరకు జూన్ 21-24 వరకు మోదీ అమెరికాలో పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజుల అమెరికా పర్యటన కోసం ప్రధాని మోదీ మంగళవారం న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్వాగతం పలికారు. అలాగే ప్రధాని మోదీకి భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యుల నుంచి అద్భుతమైన స్వాగతం లభించింది. వారు ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.
న్యయార్క్ చేరుకున్న ప్రధాని వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ప్రముఖ పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియో, ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ రోమర్.. వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు.
Also Read: 'నేను మోడీ అభిమానిని': ఎలోన్ మస్క్
ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈరోజు పలువురు మేధావులు, నిపుణులతో కూడా బృందాన్ని కలిశారు. భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి, ఉగ్రవాదం వంటి పలు అంశాలను వారితో చర్చించారు. ప్రధాని మోదీని కలిసిన వారిలో మైఖేల్ ఫ్రోమాన్, డేనియల్ రస్సెల్, డాక్టర్ మాక్స్ అబ్రమ్స్, జెఫ్ ఎం. స్మిత్, ఎల్బ్రిడ్జ్ కాల్బీ, గురు సోవ్లే ఉన్నారు.
అలాగే.. యూఎస్‌లో నాయకత్వ స్థానాల్లో ఉన్న విద్యావేత్తల బృందాన్ని ప్రధాని మోదీ కలుసుకున్నారు. భారతదేశంలోని భారతీయ విశ్వవిద్యాలయాలతో విద్యా సహకారాన్ని మెరుగుపరచడంతో పాటు పలు అంశాలపై వారు చర్చించారు. ప్రధాని మోదీతో భేటీ అయిన విద్యావేత్తలలో.. ప్రొఫెసర్ రత్తన్ లాల్, డాక్టర్ నీలి బెండపూడి, డాక్టర్ ప్రదీప్ ఖోస్లా, డాక్టర్ సతీష్ త్రిపాఠి, చంద్రికా టాండన్, ప్రొఫెసర్ జగ్మోహన్ రాజు, డాక్టర్ మాధవ్ వి రాజన్, డాక్టర్ అనురాగ్ మైరాల్ ఉన్నారు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేస్తున్న నిపుణుల బృందాన్ని కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ బేటీ ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను చర్చించారు. అలాగే ఆరోగ్య పరిష్కారాలను కనుగొనడానికి సాంకేతికతను ఉపయోగించడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిపారు. ప్రధాని మోదీతో భేటీ అయిన ఆరోగ్య రంగ నిపుణుల్లో.. నోబెల్ గ్రహీత డాక్టర్ పీటర్ అగ్రే, డాక్టర్ లాటన్ రాబర్ట్ బర్న్స్, డాక్టర్ స్టీఫెన్ క్లాస్కో, డాక్టర్ పీటర్ హోటెజ్, డాక్టర్ సునీల్ ఎ డేవిడ్, డాక్టర్ వివియన్ ఎస్. లీలు ఉన్నారు.