కాశ్మీర్‌పై ఎంతవరకైనా సై.. భారత్‌తో అణుయుద్ధమైనా ఓకే: ఇమ్రాన్ ఖాన్

By Siva KodatiFirst Published Aug 27, 2019, 7:38 AM IST
Highlights

కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై విషం కక్కారు. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన... కాశ్మీర్ విషయంలో భారత్‌తో అణుయుద్ధానికైనా తాము సిద్ధమేనని ఇమ్రాన్ ప్రకటించారు.

కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై విషం కక్కారు. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన... కాశ్మీర్ విషయంలో భారత్‌తో అణుయుద్ధానికైనా తాము సిద్ధమేనని ఇమ్రాన్ ప్రకటించారు.

పరిస్ధితులు యుద్ధానికి దారి తీస్తే.. రెండు దేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్‌తో శాంతి కోసం ప్రయత్నించాం.. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల నిమిత్తం శాంతిని నెలకొల్పడానికి కృషి చేశామన్నారు.

కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేస్తే.. మేం రెండడుగులు వేస్తామన్నాం.. కానీ ఉగ్రవాదాన్ని సాకుగా చూపించి భారత్ తప్పించుకుందని ఇమ్రాన్ ఆక్రోశం వ్యక్తం చేశారు.

ఎన్నికలు రాగానే.. పుల్వామా ఘటనకు సంబంధించి తప్పంతా పాక్ మీద తోసేసింది.. దీంతో తాము ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చిందన్నారు. కానీ భారత్ మాత్రం ఎఫ్ఏటీఎఫ్‌లో పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చడానికి.. అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని ఇమ్రాన్ మండిపడ్డారు.

కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మోడీ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ మాట్లాడుతుందన్నారు.

ముస్లిం దేశాలు సైతం పాకిస్తాన్‌కు మద్ధతివ్వడం లేదన్న విషయంపై స్పందిస్తూ.. ఆర్ధిక సంబంధాల వల్ల వారు ముందుకు రాకపోవచ్చని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. 

click me!