Pakistan Tea: టీ తాగడం తగ్గించి దేశాన్ని గట్టెక్కించండి: పాక్ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి

Published : Jun 15, 2022, 02:16 PM IST
Pakistan Tea: టీ తాగడం తగ్గించి దేశాన్ని గట్టెక్కించండి: పాక్ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి

సారాంశం

పాకిస్తాన్ ప్రభుత్వం ఓ విచిత్ర ప్రకటన చేసింది. దేశ ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని సూచించింది. తద్వార ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలని కోరింది. ప్రపంచంలో అత్యధికంగా తేయాకు దిగుమతి చేసుకునే దేశం పాకిస్తానే కావడం గమనార్హం.

న్యూఢిల్లీ: మనం చూస్తుండగానే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వైనాన్ని చూశాం. విద్యుత్ కోతలు, ఇంధనం కొరత, ఇతర సేవలు స్తంభించిపోవడంతో దేశ ప్రజలందరినీ చీకటిలో నిర్బంధించిన పరిస్థితులు కనిపించాయి. ఇదే బాటలో పాకిస్తాన్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తున్నది. విదేశీ మారక నిల్వలు లేకనే శ్రీలంక సతమతం అవుతున్నది. పాకిస్తాన్‌లోనూ విదేశీ మారక నిల్వలు కరిగిపోయినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఓ విచిత్ర ప్రకటన చేసింది.

దేశ ప్రజలు టీ తాగడం తగ్గించాలని, తద్వార దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సహకరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. ప్రతి రోజూ తాగే టీ కప్పుల సంఖ్యను తగ్గించుకుంటే దేశ దిగుమతి ఖర్చులు తగ్గుముఖం పడుతాయని తెలిపింది.

ప్రపంచంలో తేయాకును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్తాన్ నెంబర్ వన్ ప్లేస్‌ లో ఉంటుంది. కాబట్టి, ఈ దిగుమతిని తగ్గించుకోవాలని భావిస్తున్నది. తద్వార విదేశీ మారక నిల్వలను మరింత పొదుపుగా వాడుకోవాలని ఆలోచిస్తున్నది. 

పాకిస్తాన్ గతేడాది 60 కోట్ల డాలర్ల కన్నా ఎక్కువ విలువైన తేయాకును దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మంత్రి ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీ తాగడం తగ్గించుకోవాలని కోరారు. ఎందుకంటే.. ప్రభుత్వం ఈ టీని అప్పు తెచ్చి మరీ దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగానే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, వాటిని తగ్గించే పనిలో ఉండకుండా.. ప్రజలనే టీ తాగడం తగ్గించాలని కోరడం హాస్యాస్పదంగా ఉన్నదని నెట్టింట్లో పాక్ ప్రజలు ఫైర్ అవుతున్నారు.

టీ తాగడాన్ని తగ్గించుకోవడంతో పాటు విద్యుత్‌ను కూడా ఆదా చేయాలని పాక్ ప్రభుత్వం కోరింది. ఇందుకోసం మార్కెట్‌ లలో వాణిజ్య సముదాయాలు, దుకాణాలు రాత్రి 8.30 గంటల కల్లా మూసేయాలని సూచించింది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర రెండు నెలలకు దిగుమతులు చేసుకోవడానికి సరిపడేంత మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నట్టు సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే