ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకోసమంటే..

By Sumanth KanukulaFirst Published Jan 10, 2023, 4:27 PM IST
Highlights

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన పలువురు నేతలకు ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన పలువురు నేతలకు ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ధిక్కార కేసులో ఈ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్టుగా తెలిపింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ), చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సికిందర్ సుల్తాన్ రాజాపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అగ్రనేతలు జారీ చేసిన ప్రకటనల ఆధారంగా ఈ పరిణామాలు చోటుచేసున్నాయి. నిసార్ దుర్రానీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పాకిస్తాన్ ఎన్నికల సంఘం బెంచ్.. ఇమ్రాన్ ఖాన్, ఆయన సన్నిహితులు ఫవాద్ చౌదరి, అసద్ ఉమర్‌లపై వారెంట్లు జారీ చేసింది.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్‌కు (పీఎమ్‌ఎల్-ఎన్) అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమీషన్‌ను, సికిందర్ సుల్తాన్ రాజా పిటిఐ నేతలు పదే పదే దూషించడంతో..  ఈసీపీ గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధిక్కార అధికారాలను వినియోగించుకుని వారిపై నోటీసులు జారీ చేసింది. తమది పక్షపాత విధానమని స్పష్టం చేసింది. గత విచారణలో.. పీటీఐ నాయకులు తమ ఎదుట హజరయ్యేందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం చివరి అవకాశం ఇచ్చింది. 

అయితే మంగళవారం విచారణ సందర్భంగా.. కమీషన్ హాజరు నుండి మినహాయింపు కోసం పీటీఐ నేతలు చేసిన అభ్యర్థనలను బెంచ్ తిరస్కరించింది. బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. విచారణను ధర్మాసనం జనవరి 17కి వాయిదా వేసింది.

ఇక, చట్టప్రకారం తటస్థ పాత్రను పోషించడంలో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ విఫలమయ్యారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు. అయితే తాను చట్ట ప్రకారమే పనిచేస్తున్నానని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ చెబుతున్నారు. 
 

click me!