యుద్ధం వస్తే... భారత్ ముందు నిలవలేం: అంగీకరించిన ఇమ్రాన్

By Siva KodatiFirst Published Sep 15, 2019, 11:06 AM IST
Highlights

కాశ్మీర్ విషయంగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌లో రోజు రోజుకి నైరాశ్యం పెరిగిపోతోంది. యుద్ధమే గనుక వస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలబడలేదని అంగీకరించారు

కాశ్మీర్ విషయంగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌లో రోజు రోజుకి నైరాశ్యం పెరిగిపోతోంది. యుద్ధమే గనుక వస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలబడలేదని అంగీకరించారు.

ఇటీవల అల్ జజీరా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్టాడుతూ.. సాధారణ యుద్ధంలో పాక్ ఓడిపోయినా అణుయుద్ధంలో విజయావకాశాలను కొట్టిపారేయలేమన్నారు.

రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే అది అణ్వస్త్రాలతోనే ముగుస్తుందని.. కాబట్టి యుద్ధమే కనుక వస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తాను మాత్రం యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

కాగా శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని 20 కోట్ల మంది ముస్లింలు తీవ్రవాదం వైపు మళ్లే అవకాశం ఉందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ముజఫరాబాద్ పర్యటన సందర్భంగా ఇమ్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ‘‘ గో బ్యాక్’’ నినాదాలు చేశారు.

పీకల్లోతు ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను గట్టెక్కిస్తానని... భారత్‌తో సత్సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తానని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం అవేవి సాధ్యంకాకపోవడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు భారత్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారు. 

click me!