బిన్ లాడెన్ కుమారుడు హమ్జా హతం: ధ్రువీకరించిన ట్రంప్

By telugu teamFirst Published Sep 14, 2019, 8:34 PM IST
Highlights

ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఆగస్టు మొదటివారంలో హమ్జా మరణించినట్లు వార్తలు వచ్చినా ట్రంప్ నోరు విప్పలేదు.

వాషింగ్టన్: ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ కుమారుడు, ఆల్ ఖాయిదా వారసుడు హమ్జా బిన్ లాడెన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో హమ్జా హతమైనట్లు ట్రంప్ తెలిపారు. 

హమ్జా బిన్ లాడెన్ మరణించినట్లు నిఘా విభాగాన్ని ఉటంకిస్తూ అమెరికా మీడియా ఆగస్టు మొదటివారంలోనే వార్తలు ప్రచురించింది. అమెరికా ఆపరేషన్స్ లో హమ్జా గత రెండేళ్లలో ఎప్పుడో మరణించి ఉండవచ్చునని అమెరికా మీడియా వార్తలు తెలియజేశాయి. 

గత నెలలో అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ కూడా హమ్జా బిన్ లాడెన్ మృతిని ధ్రువీకరించారు. చనిపోయాడనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు ఆ విషయంపై మాట్లాడలేదు. హమ్జా మరణించాడని ట్రంప్ శనివారం చెప్పారు. 

ఉన్నత స్థాయి ఆల్ ఖాయిదా సభ్యుడు, ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో హతమైనట్లు శ్వేతసౌధం నుంచి వెలువడిన సంక్షిప్త ప్రకటనలో ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ ఎప్పుడు జరిగిందనే విషయం ప్రకటనలో లేదు. 

click me!