నేనూ మీలో ఒకరినే.. పెళ్లి రద్దు చేసుకున్న ప్రధాన మంత్రి

By Mahesh KFirst Published Jan 23, 2022, 11:43 AM IST
Highlights

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా అర్డార్న్ తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ వేసవిలో ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉన్నట్టు తెలిసింది. కానీ, స్థానికంగా ఒమిక్రాన్ వ్యాపిస్తున్నట్టు వెలుగులోకి రావడంతో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తానూ సగటు న్యూజిలాండ్ పౌరుడికి భిన్నం కాదని, తానూ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: నేనూ మీలో ఒకరినే.. మీకు వర్తించే నిబంధనలే నాకూ వర్తిస్తాయి. బాధలు అందరికీ ఒకటే.. అంటూ న్యూజిలాండ్(New Zealand) ప్రధానమంత్రి జెసిండా అర్డార్న్(PM Jacinda Ardern) అన్నారు. కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) స్థానికంగా కేసులు రిపోర్ట్ అవుతుండటంతో తన పెళ్లి(Marriage)ను రద్దు చేసుకున్నట్టు ఆమె ప్రకటించారు. న్యూజిలాండ్‌లో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ కావడం మొదలైంది. దీంతో ఆ దేశం కఠిన నిబంధనలను ప్రకటించింది.

న్యూజిలాండ్ దేశంలో మాస్క్ రూల్స్ కఠినం చేశారు. బార్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సేవలు అందించే ప్రాంతాల్లో 100 మందికే అనుమతులు ఇచ్చింది. వివాహం వంటి వేడుకల్లోనూ ఈ పరిమితే విధించింది. ఒక వేళ వ్యాక్సినేషన్ గురించి పరిశీలన లేకుంటే.. ఆ వేడుకల్లో ప్రజల సంఖ్యను 25కే కుదించింది. న్యూజిలాండ్‌లో ఇటీవలే జరిగిన ఓ వివాహ వేడుక స్థానికంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతున్నదనే విషయాన్ని వెల్లడించింది. ఆ వేడుకకు హాజరైన తొమ్మిది మందికి కొత్త వేరియంట్ సోకింది.

న్యూజిలాండ్ ఉత్తర భాగం రాజధాని అయిన ఆక్లాండ్ నుంచి దక్షిణంలోని ఓ దీవికి పెళ్లి వేడుకకు హాజరు కావడానికి ఓ కుటుంబం ప్రత్యేక విమానంలో వెళ్లింది. ఆ వేడుకకు 100 మంది హాజరయ్యారు. ఆక్లాండ్ నుంచి వెళ్లిన కుటుంబ సభ్యులు సహా ఫ్లైట్ అటెండాంట్స్ కలిపి మొత్తం  తొమ్మిది మందికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ అని తేలింది.

ఈ నేపథ్యంలోనే ఆమె తన పెళ్లిని రద్దు చేసుకుంటున్న నిర్ణయాన్ని వెల్లడించారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డార్న్ టెలివిజన్ వ్యాఖ్యాత క్లార్క్ గాఫోర్డ్‌ను వివాహం చేసుకుంటున్నారని సమాచారం ఉన్నది. వారు ఈ వేసవిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది. కానీ, ఇంతలోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పెళ్లి వాయిదా పడటంపై ఆమె అభిప్రాయాన్ని అడగ్గా.. జీవితం అంటేనే ఇలాంటివి వస్తుంటాయని, అన్నీ ప్రణాళిక బద్ధంగా వెళ్లలేవు కదా అని తెలిపారు. తానూ సగటు న్యూజిలాండ్ పౌరుడి కంటే వేరు కాదని చెప్పారు.

ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో అవాంతరాలు, విషాదాలను ఎదుర్కొన్న వేలాది మంది న్యూజిలాండ్ పౌరుల కంటే తాను వేరు కాదని ఆమె అన్నారు. పెళ్లి వాయిదా పడటం కంటే కూడా బాధాతప్త ఘటనలు ఉన్నాయని వివరించారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది వ్యాధి బారిన పడి ఆప్తులకు దూరంగా గడపాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు. తనకు తెలిసిన దాంట్లో.. తాను అనుభవించిన దాంట్లో అదే అత్యంత విషాదభరితమైనవని పేర్కొన్నారు.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల (Corona cases) సంఖ్య 3,92,37,264కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా‌తో 525 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,59,168‌ మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి జయించినవారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

click me!