అమ్మా.. చాలా బాధగా ఉంది.. ఇక్కడ పౌరులనూ చంపాల్సి వస్తున్నది: మరణానికి ముందు రష్యా జవాను సందేశం

Published : Mar 01, 2022, 02:51 PM IST
అమ్మా.. చాలా బాధగా ఉంది.. ఇక్కడ పౌరులనూ చంపాల్సి వస్తున్నది: మరణానికి ముందు రష్యా జవాను సందేశం

సారాంశం

ఓ జవాన్ తన మరణానికి ముందు తల్లికి రాసిన లేఖ కంటతడి పెట్టిస్తున్నది. తాము పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా గంభీరంగా చెబుతున్నది. కానీ, ఆ జవాన్ తన తల్లికి ఆవేదనగా రాసిన లేఖ అందుకు విరుద్ధమైన వాస్తవాన్ని తెలియజేస్తున్నది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమది కేవలం సైనిక చర్య మాత్రమేనని, యుద్ధం కాదని స్పష్టం చేశారు. తమ దాడులు కేవలం ఉక్రెయిన్ సైన్య స్థావరాలపై మాత్రమే ఉంటుందని, సామాన్య పౌరులను లక్ష్యం చేసుకోబోమని వివరించారు. జనసమ్మర్థమైన ప్రాంతాల్లో బాంబులు వేయమని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు పేర్కొన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే.. రష్యా సైనికులు ఉక్రెయిన్ సాధారణ పౌరులనూ టార్గెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. మరణానికి ముందు ఓ జవాన్ తన తల్లికి రాసిన చివరి మెస్సేజీ ద్వారా ఈ విషయం వెల్లడి అవుతున్నది. ఆ టెక్స్ట్ మెస్సేజీని ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలో చదివి వెల్లడించింది.

ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడానికి ముందు ఆ జవాను తన తల్లికి రాసిన సందేశంలో ఇలా పేర్కొన్నారు. అమ్మా.. నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను. ఇక్కడ నిజమైన యుద్ధం రాజుకుంటున్నది. నాకు చాలా భయంగా ఉన్నది. మేం అన్ని నగరాలను ఒకే గాటన కట్టేసి బాంబులతో దాడి చేస్తున్నాం. సాధారణ పౌరులనూ లక్ష్యం చేసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

తన సందేశానికి జవాబు రావడానికి ఎందుకు ఎక్కువ సమయం తీసుకున్నావని తల్లి ఆ జవాన్‌ను ఓ మెస్సేజీలో అడిగింది. తాను ఒక పార్సిల్ పంపాలని భావిస్తున్నట్టు తెలిపింది. దీనికి సమాధానంగా ఆ జవాన్ ఇలా సమాధానం ఇచ్చారు. తాను ఉక్రెయిన్‌లో ఉన్నానని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నదని పేర్కొన్నారు.

‘మమ్మల్ని ఉక్రెయిన్ పౌరులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారని మాకు చెప్పారు. కానీ, ఇక్కడ అలాంటిదేమీ లేదు. వారు మా సాయుధ వాహనాలను ముందుకు కదలనివ్వకుండా వాటి కింద పడిపోవడానికి వస్తున్నారు. మా వాహనాల చక్రాల కిందకు వచ్చి ప్రాణాలు అర్పించడానికీ ప్రయత్నిస్తున్నారు. వారు మమ్మల్ని ఫాసిస్టులు అని తిడుతున్నారు. అమ్మా.. ఇది చాలా బాధగా ఉన్నది’ అని మరో సందేశంలో ఆ రష్యా జవాన్ తన తల్లికి రాశారు. బహుశా ఈ లేఖ ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రారంభానికి పూర్వం పంపినది అయి ఉంటుంది. బహుశా ఆ జవాన్ అప్పుడు క్రిమియా నుంచి ఉక్రెయిన్‌కు వెళ్తూ ఉండవచ్చు.

ఈ మెస్సేజీని ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ అంబాసిడర్ చదివి వినిపించారు. ఈ లేఖల ద్వారా ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసాన్ని ఊహించుకోవచ్చని ఆయన తెలిపారు. 

ఉక్రెయిన్ వివరాల ప్రకారం, ఇప్పటి వరకు వారు కనీసం 4,500 మంది రష్యా సైనికులను పొట్టనబెట్టుకున్నారు.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి