పాక్‌లో వెంటిలేటర్‌పై 26/11 దాడుల సూత్రదారి సాజిద్ మీర్ .. విష ప్రయోగం అనుమానాలు, ఐఎస్ఐ పనేనా..?

By Siva KodatiFirst Published Dec 5, 2023, 5:30 PM IST
Highlights

ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ మీర్‌ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నాడు. పాకిస్తాన్‌ జైల్లో వున్న అతనిపై విష ప్రయోగం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. గతేడాది యాంటీ టెర్రరిజం కోర్టులో శిక్ష పడినప్పటి నుంచి సాజిద్ మీర్ పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు, వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణిస్తున్న సంగతి తెలిసిందే. వారిని ఎవరు చంపుతున్నారో..ఎందుకు చంపుతున్నారో తెలియక పాక్ ప్రభుత్వం ముఖ్యంగా ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ తలలు పట్టుకుంటోంది. తాజాగా ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ మీర్‌ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నాడు. పాకిస్తాన్‌ జైల్లో వున్న అతనిపై విష ప్రయోగం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. గతేడాది యాంటీ టెర్రరిజం కోర్టులో శిక్ష పడినప్పటి నుంచి సాజిద్ మీర్ పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

కొద్దిరోజుల క్రితం అతను ఉన్నట్లుండి ఆసుపత్రి పాలైనట్లుగా జాతీయ వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. జైలులోనే ఆయనపై విష ప్రయోగం జరిగినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశంలో వరుసపెట్టి ఉగ్రవాదులను గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తూ వుండటంతో సాజిద్ మీర్‌ ప్రాణాలకు ముప్పు వుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయనను మరో జైలుకు తరలించాలని అధికారులు భావించారు. కానీ ఇంతలోనే మీర్ ఆసుపత్రి పాలయ్యాడు. ఎప్పటిలాగే పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐలు సాజిద్ మీర్ విషయంలో కట్టుకథలు చెబుతున్నాయి. 

ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులకు కీలక సూత్రధారి అయిన సాజిద్ మీర్‌కు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై గతేడాది ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది.  ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమీక్షకు ముందు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులపై తాము చర్య తీసుకున్నామని చెప్పడానికి పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. జైలు శిక్షతో పాటు సాజిద్ మీర్‌పై 4,20,000 జరిమానా కూడా విధించింది న్యాయస్థానం.

పాకిస్తాన్‌లో మీర్‌పై విషప్రయోగం ద్వారా ఆయన చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేయించి అంతిమంగా అతనిని అమెరికాకు అప్పగించకుండా వుండేందుకు ఐఎస్ఐ ఈ ప్రయత్నం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ లిస్ట్‌లో సాజిద్ మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా వున్నాడు. అతని తలపై 5 మిలియన్ అమెరికన్ డాలర్ల బహుమతిని కూడా ఎఫ్‌బీఐ ప్రకటించింది. 

26/11 ఉగ్రదాడులకు కుట్ర పన్నడం దగ్గరి నుంచి దాడులు చేసేందుకు భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులకు మీర్ పాకిస్తాన్ నుంచే సూచనలు చేశాడనే అభియోగాలు వున్నాయి. సాజిద్ మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా పేర్కొనాలని, అతని ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు ప్రయాణ నిషేధాన్ని విధించాలని భారత్, అమెరికాలు చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితిలో ఆమోదం లభించింది. 

click me!