కరోనా కేసులు తగ్గాలంటే.. ఇలా చేస్తే సరి: ట్రంప్ చిట్కా

By Siva KodatiFirst Published Jun 21, 2020, 3:53 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మానవాళి ఆందోళనకు గురవుతోంది. ఈ క్రమంలో కోవిడ్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మానవాళి ఆందోళనకు గురవుతోంది. ఈ క్రమంలో కోవిడ్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంలో వైరస్ నిర్థారణ పరీక్షలు చేయడం తగ్గించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. శనివారం ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా నిర్థారణ పరీక్షలు అనేది కత్తికి రెండు వైపులా పదును లాంటిదన్న ఆయన.. ఎక్కువ కేసులు చేస్తేనే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయని, అందుకే పరీక్షలు తగ్గించాలని అధికారులను కోరినట్లు ట్రంప్ చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే సభలో రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు కేరింతలు కొడుతుండటంతో అధ్యక్షుడు ఈ వ్యాఖ్యల్ని సరదాగా అన్నారా ..? లేక నిజంగానే అధికారులకు అలాంటి ఆర్డర్స్ ఇచ్చారా అన్నది తెలియాల్సి వుంది. కాగా అమెరికాలో ఆదివారం మధ్యాహ్నం నాటికి 22,95,615 మందికి కోవిడ్ 19 నిర్థారణవ్వగా, వీరిలో 1,21,441 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో వైరస్ ఉద్ధృతంగా ఉన్న కొత్తల్లో టెస్టులు భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రస్తుతం కూడా అగ్రరాజ్యంలో ఎలాంటి మార్పులు లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికన్ సమాజంలో కలకలం రేపుతున్నాయి. 

click me!