మోడీ అమెరికా పర్యటన సాగనుంది ఇలా...

By telugu teamFirst Published Sep 22, 2019, 12:16 PM IST
Highlights

హ్యూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ ఈవెంట్ లో పాల్గొనే దెగ్గరినుంచి, ట్రంప్ తో సమావేశం, ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేంతవరకూ మోడీ పర్యటన ఎలా సాగుతుందో మనమూ ఒక లుక్కేద్దాం పదండి. 

న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. హ్యూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ ఈవెంట్ లో పాల్గొనే దెగ్గరినుంచి, ట్రంప్ తో సమావేశం, ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేంతవరకూ మోడీ పర్యటన ఎలా సాగుతుందో మనమూ ఒక లుక్కేద్దాం పదండి. 

సెప్టెంబరు 22:

హ్యూస్టన్ నగరం చేరుకోగానే అక్కడ మొదటగా చమురు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. దాని తరువాత భారతీయ అమెరికన్లను ఉద్దేశించి హౌడీ మోడీ ఈవెంట్ లో ప్రసంగిస్తారు. ఈ ఈవెంట్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతున్నారు. 

సెప్టెంబరు 23:

హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు  అక్కడ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగిస్తారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో జరిగే మరో సభలో ఆయుష్మాన్ భారత్ గురించి వివరిస్తారు. అటు తరువాత తీవ్రవాదంపై జరిగే మరో సదస్సులో ప్రసంగిస్తారు. ఈ సదస్సుకి వివిధ దేశాధినేతలు హాజరవనున్నారు. 

సెప్టెంబర్ 24:

మోడీ అమెరికా పర్యటనలో బిజీ డే గా చెప్పవచ్చు. న్యూయార్క్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో మరోమారు భేటీ అవుతారు. ఈ  కీలకమైన భేటీలో రక్షణ రంగం, ఉగ్రవాదం, వాణిజ్యం తదితర ముఖ్యమైన అంశాలపైన చర్చించనున్నారు. ఈ భేటీ ముగియగానే గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంపైభాగాన ఏర్పాటు చేసిన సోలార్ పార్కును ప్రారంభిస్తారు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీ శాంతి వనాన్ని ప్రారంభిస్తారు. స్వచ్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గాను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పురస్కారాన్ని స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాల తరువాత ఇండో పసిఫిక్ దీవుల నేతల సమావేశంలో ప్రసంగిస్తారు. 

సెప్టెంబర్ 25:

బ్లూమ్ బెర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ మీటింగులో కీలక ఉపన్యాసం చేస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మైక్ బ్లూమ్ బెర్గ్ తో పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు. అటు తరువాత 45 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఇన్వెస్టుమెంట్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత కరేబియన్ దేశాల నాయకులతో జరిగే ఇండో-కరికోమ్ సమావేశంలో పాల్గొంటారు. 

సెప్టెంబర్ 26: 

పలు దేశాల నేతలతో, కంపెనీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దాదాపుగా 20 బృందాలతో చర్చలు జరపనున్నట్టు తెలియవస్తుంది. 

సెప్టెంబర్ 27:

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ఇలా ఐరాస సభలో ప్రసంగించడం మోడీకి రెండోసారి. భారతదేశం పెట్టుబడులకు చాలా అనుకూలం అనే పాయింట్ ను నొక్కి వక్కాణించనున్నారు ప్రధాని మోడీ. 

click me!