Russia Ukraine War: యుద్ధం వద్దన్నందుకు 15 ఏళ్ల జైలు.. ఇవి కఠినమైన రోజులన్న రష్యా చానెల్ ఎడిటర్‌

Published : Mar 16, 2022, 09:41 AM IST
Russia Ukraine War: యుద్ధం వద్దన్నందుకు 15 ఏళ్ల జైలు.. ఇవి కఠినమైన రోజులన్న రష్యా చానెల్ ఎడిటర్‌

సారాంశం

యుద్ధం వద్దు అంటూ ఓ మీడియా సంస్థ ఉద్యోగినిపై రష్యా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. టీవీ చానెల్ తెర మీదకు యుద్ధం వద్దంటూ రాసి ఉన్న పోస్టర్‌ను ఆమె తీసుకుని వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సుమారు 14 గంటలకు పైగా ఆమెను విచారించారు.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో రష్యా దాడికి ఇంటా బయట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ దేశాలు, అమెరికా సహా అనేక దేశాలు రష్యా తీరును తప్పుబట్టాయి. కొన్ని దేశాలు మాత్రం తటస్థ వైఖరిని తీసుకున్నాయి. ఇదిలా ఉండగా, రష్యా ప్రభుత్వానికి సొంత పౌరుల నుంచే నిరసన సెగ ఎదురవుతున్నది. ఇప్పటికే పౌరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే.. వారిని నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, రష్యా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా సంస్థ చానెల్ వన్ ఎడిటర్ రష్యాకు వ్యతిరేకంగా లైవ్‌లో నిరసన తెలిపారు. యుద్ధం వద్దంటూ ఆమె ఓ పోస్టర్ పట్టుకుని టీవీ తెర మీదకు వచ్చారు. అంతే వెంటనే.. ఆ చానెల్ మరో ఫుటేజీ చూపెట్టింది. అయితే, ఆమెపై రష్యా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నది. 15  ఏళ్లపాటు ఆమెకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నదని తెలిసింది.

అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పోస్టు చేసిన వీడియో ప్రకారం, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తాను నిరసించానని మెరీనా ఒవ్‌స్యన్నికోవా తెలిపారు. ఆ తర్వాత తనను 14 గంటలు విచారించారని వివరించారు. ఈ సమయంలో కనీసం తన కుటుంబ సభ్యులనూ సంప్రదించడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తనకు న్యాయపరమైన సహాయం కూడా అందనివ్వలేదని పేర్కొన్నారు. 

యుద్ధానికి వ్యతిరేకంగా తాను స్వయంగా నిర్ణయం తీసుకున్నారని, ఎందుకంటే ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడాన్ని తాను ఇష్టపడటం లేదని వివరించారు. ఇది దారుణమైన విషయం అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి సహకరించిన తన తోటి ఉద్యోగులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవి తన జీవితంలో కఠినమైన రోజులు అని చెప్పారు. రెండు రోజులుగా తాను నిద్రనే పోలేదని అన్నారు. పోలీసులు ఇంటరాగేషన్ కనీసం 14 గంటల సాగిందని తెలిపారు. 

ఓ అధికారిక మీడియా చానెల్‌లో ఓ ఉద్యోగి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఓ పోస్టర్ చేతపట్టుకుని లైవ్ టెలికాస్ట్‌లోకి వచ్చింది. వెంటనే ఆమెను అక్కడున్న తోటి ఉద్యోగులు పక్కనకు తీసుకెళ్లి ఫుటేజీ మార్చారు. ఆ వెంటనే ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నదో తెలియట్లేదని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రష్యాలో ప్రభుత్వ నియంత్రణలోని చానెల్ వన్‌ను ఆ దేశంలోని వయోధికులు ఎక్కువగా చూస్తుంటారు. ఆ చానెల్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే న్యూస్ షో ‘టైమ్’ను లక్షలాది మంది వీక్షిస్తుంటారు. ఆ రోజు యాంకర్‌గా యెకతెరినా ఆంద్రెయెవా ఉన్నారు. ఆమె బెలారస్‌తో రష్యాకు ఉన్న సంబంధాల గురించి ప్రోగ్రామ్‌లో చర్చిస్తున్నారు. నల్లటి ఫార్మల్ సూట్ ధరించిన ఒవ్‌స్యన్నికోవా ఓ పోస్టర్ పట్టుకుని కెమెరా వ్యూలోకి వచ్చారు. ఆ పోస్టర్ కార్డుపై నో వార్ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. ‘అదే పోస్టర్‌లో రష్యా భాషలో ఇలా రాసి ఉంది. యుద్ధాన్ని ఆపండి. దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇక్కడ అంతా మీకు అబద్ధాలు చెబుతున్నారు’ ఈ యుద్ధానికి రష్యన్లు వ్యతిరేకం అని ఇంగ్లీష్‌లో సైన్ చేసి ఉన్నది. ఆ పోస్టర్ పట్టుకున్న మహిళ కొన్ని మాటలు అన్నది. స్టాప్ ద వార్ అనే ముక్క వినిపించింది. అంతలోనే ఆంద్రెయెవా గట్టిగా వార్తలు చెప్పడంతో ఆమె మాటలు ఎక్కువగా వినిపించలేదు. వెంటనే ఆ చానెల్ ఓ హాస్పిటల్‌లోని ఫుటేజీని ప్రసారం చేసింది. అలాగే, ఆ పోస్టర్ పట్టుకున్న ఒవ్‌స్యన్నికోవాను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే