‘మరియుపోల్‌’ను ఆక్రమించుకున్న రష్యా.. ఇది మా బలగాల విజయం: వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు

Published : Apr 21, 2022, 02:24 PM IST
‘మరియుపోల్‌’ను ఆక్రమించుకున్న రష్యా.. ఇది మా బలగాల విజయం: వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు

సారాంశం

మరియుపోల్ నగరాన్ని ఆక్రమించుకున్నట్టు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇది రష్యా బలగాల విజయంగా పేర్కొన్నారు. అయితే, ఈ నగరంలోని ఓ స్టీల్ ప్లాంట్‌లో మాత్రం ఇంకా ఉక్రెయిన్ బలగాలు తలదాచుకున్నట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పోర్టు నగరం, వ్యూహాత్మక ప్రాంతమైన మరియుపోల్‌ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. మరియుపోల్‌ను ఉక్రెయిన్ నుంచి విముక్తి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇది రష్యా బలగాల విజయంగా ఆయన అభివర్ణించారు.

రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ విషయాన్ని చెప్పారు. మరియుపోల్ నగరాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఓ టీవీ మీటింగ్‌లో వెల్లడించారు. అక్కడి అజోవ్‌స్టాల్ ప్లాంట్‌ను మాత్రం ఇంకా తమ అధీనంలోకి తెచ్చుకోలేదని వివరించారు. ఇప్పటికీ మరియుపోల్ కోసం కొట్లాడుతున్న ఉక్రెయిన్ బలగాలు ఈ స్టీల్ ప్లాంట్‌లోనే తలదాచుకుంటున్నాయని తెలిపారు. ఆ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న అండర్‌గ్రౌండ్ ఫెసిలిటీ కారణంగా దాన్ని అదుపులోకి తెచ్చుకోవడం కొంత క్లిష్టంగా ఉన్నదని
తెలిపారు.

దీనిపై స్పందిస్తూ వ్లాదిమిర్ పుతిన్ రష్యా బలగాలపై ప్రశంసలు కురిపించారు. ఇది రష్యా బలగాల విజయం అని పేర్కొన్నారు. మరియుపోల్‌ను విముక్తి చేశారని అన్నారు. అంతేకాదు, ఇప్పుడు మరియుపోల్‌లో అంటే ముఖ్యంగా ఆ స్టీల్ ప్లాంట్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దాడులను ఆపేసి ఆ స్టీల్ ప్లాంట్‌ను బ్లాక్ చేస్తే సరిపోతుందని వివరించారు. ఒక ఈగ కూడా ఆ స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వెళ్లకుండా సీజ్ చేస్తే సరిపోతుందని సూచించారు.

ప్రస్తుతం ఆ స్టీల్ ప్లాంట్ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌లో సుమారు 2000 మంది ఉక్రెయిన్ జవాన్లు ఉన్నారు.

మరియుపోల్‌ వ్యూహాత్మక నగరం. దీన్ని స్వాధీనం చేసుకోవడం రష్యాకు కలిసొచ్చే అంశం. దీని ద్వారా ఇది వరకే రష్యా ఆక్రమించుకున్న క్రిమియాను, రష్యా అనుకూల ప్రాంతాలు ఎల్పీఆర్, డీపీఆర్‌లను అనుసంధానించినట్టయింది. తద్వార ఉక్రెయిన్‌కు తీర ప్రాంతాన్ని చాలా వరకు రష్యా కుదించేసినట్టు అయింది. మరియుపోల్ నగరం రష్యాకు చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం.

మరియుపోల్ నుంచి పౌరులను తరలిస్తున్నామని ఉక్రెయిన్ ఉపప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు బస్సుల్లో పౌరులను తరలించినట్టు వివరించారు. ఇంకా చిన్న పిల్లలు, మహిళలలు, వయోధికులను తరలించాల్సి ఉన్నదని, వారిని గురువారం కూడా తరలిస్తామని తెలిపారు. అదే తరుణంలో మరియుపోల్ కోసం ఉక్రెయిన్ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని పేర్కొన్నారు.

మరియుపోల్ నగరంలో వేలాది మంది పౌరులు ఈ యుద్ధం కారణంగా మరణించారు. సుమారు నెల రోజులుగా రష్యా ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది. ఫుడ్, వాటర్, విద్యుత్, ఇతర సౌకర్యాలు అందకుండా రష్యా ఈ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేసింది. తాజాగా, ఈ నగరాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్టు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే