
న్యూఢిల్లీ: నేడు యుద్ధ నీతులు మారాయి. ఎదుటి వారిని ఏ విధాల్లో బలహీనం చేయవచ్చునో.. అన్ని విధాల్లోనూ దాడి చేయడం ఇప్పటి నీతి. కేవలం ఆయుధాల దాడితోనే కాదు.. ఆర్థిక ఆంక్షలతోనూ.. మరికొంత ముందుకు అడుగేసి ఇంటర్నెట్ సేవలనూ నిలిపేస్తున్నాయి. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా ఏ విషయమైనా వేగంగా చేరుతున్నది. క్షేత్రస్థాయి వాస్తవాలు మొదలు.. రాజకీయ దుష్ప్రచారాలు ఇందులో వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధ కాలంలో సమాచార మాధ్యమాలపై ఆంక్షలు విధించడం సాధారణమే. నేటి ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటున్న ఇంటర్నెట్(Internet) సేవలకు అంతరాయం కలిగించడం ఓ యుద్ధ రీతి. నేడు రష్యా ఈ విధానాన్ని అవలంభించినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే.. ఆ దేశం ఉక్రెయిన్ (Ukraine)పై మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన రోజే యూరప్‌లో ముఖ్యంగా ఉక్రెయిన్‌కు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయేలా సైబర్ దాడి(Cyber Attack) జరిగినట్టు తెలిసింది.
యూఎస్ శాటిలైట్ ఆపరేటర్ క్లయింట్ వయా శాట్‌పై గత నెల 24న సైబర్ దాడి జరిగినట్టు తెలిసింది. ఫ్రాన్స్‌లో సేవలు అందించే ఆరేంజ్ సంస్థ సబ్సిడరీ నార్డ్‌నెట్‌కు చెందిన 9 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఇంటర్నెట్ సేవలను పొందలేకపోయారు. వారంతా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లారు. బిగ్ బ్లూ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నది. దీనికి చెందిన సుమారుు 40 వేల సబ్‌స్క్రైబర్లూ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. వీరంతా జర్మనీ, ఫ్రాన్స్, హంగరీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్‌లలో ఉన్నారు. తమ కేఏ శాటిలైట్ సేవలపై ఆధారపడే వినియోగదారులు సైబర్ దాడికి గురయ్యారని వయా శాట్ స్వయంగ అమెరికాలో వెల్లడించింది. వయా శాట్‌పై సైబర్ అటాక్ జరిగిందని, తద్వారా ఉక్రెయిన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో అంతర్జాల సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. తాము అధికారులతో సమన్వయంలో ఉన్నామని, దర్యాప్తు జరుగుతున్నదని వివరించింది.
ఫ్రాన్స్ స్పేస్ కమాండ్ హెడ్ జనరల్ మైఖెల్ మిచెల్ ఫ్రిడ్లింగ్ కూడా ఈ సైబర్ అటాక్‌ను ధ్రువీకరించారు. కొన్ని రోజులపాటు తాము ఈ సైబర్ అటాక్ ఎదుర్కొన్నామని, తమ వినియోగదారులు ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఈ సమస్యకు లోనయ్యారని వివరించారు. పదుల వేల సంఖ్యలో టర్మినళ్లు సేవలు అందించకుండా ఉండిపోయాయని తెలిపారు. ఈ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో జర్మనీలోని సుమారు 5,800 వైండ్ టర్బైన్‌ల పనితీరుపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సైబర్ దాడిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదని, ఈ సైబర్ అటాక్ ద్వారా చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లిందని వివరించారు.
ఇదిలా ఉండగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం వార్తలు, స్వేచ్ఛా ప్రసంగంపై కఠినమైన కొత్త అణిచివేత చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రష్యాలో తమ పాత్రికేయ కార్యకలాపాలను నిలిపివేయడానికి అనేక పాశ్చాత్య మీడియా సంస్థలు ముందుకొచ్చాయి. బ్లూమ్‌బెర్గ్ న్యూస్, BBC ఉక్రెయిన్ దండయాత్రపై స్వతంత్ర జర్నలిజాన్ని ప్రభావితం చేసే విధంగా పుతిన్ సర్కారు శుక్రవారం సంతకం చేసిన కొత్త సెన్సార్‌షిప్ చట్టం కారణంగా రష్యాలోని తమ కరస్పాండెంట్‌లు ఇకపై స్వేచ్ఛగా నివేదించలేరని పేర్కొంది. శనివారం నాటికి అమలులోకి వచ్చే చట్టం ప్రకారం.. యుద్ధాన్ని కేవలం వార్ గానే వర్ణించే పాత్రికేయులకు జైలు శిక్ష విధించబడుతుంది.