
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం ఒక దేశం తర్వాత మరో దేశాన్ని కుదిపేస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ ఆసియా దేశం లెబనాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. చమురు కొనుగోలుకే ఆపసోపాలు పడుతున్నది. దేశమంతా విద్యుత్ సరఫరా చేయడానికి ఆ దేశానికి తడిసి మోపెడవుతున్నది. ఇంత కష్టపడ్డా ఇప్పుడు రోజులో కొన్ని చోట్ల 22 గంటలు విద్యుత్ కోతలే ఉంటున్నాయి. ఈ దేశంలో పౌరులు బ్యాంకులో దాచుకున్న వారి సొంత డబ్బును కూడా పొందలేకపోతున్నారు. ఓ వ్యక్తి తన తండ్రికి సర్జరీ చేయాల్సి ఉన్నదని బ్యాంకుకు వెళ్లి డబ్బుల కోసం బ్రతిమాలాడు. కానీ, డబ్బులు ఇవ్వలేమని బ్యాంకు ఉద్యోగులు చెప్పారు. ఓ గన్, పెట్రోల్ నింపిన డబ్బా పట్టుకుని వచ్చాడు. తొలుత బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పని జరగలేదు. చివరకు బ్యాంకు ఉద్యోగులను బంధించాడు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తి కూల్ డౌన్ చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
42 ఏళ్ల బస్సామ్ అల్ షేక్ హుస్సేన్ లెబనాన్ వాసి. ఫుడ్ డెలివరీ డ్రైవర్. ఆయన బ్యాంకులో తన అకౌంట్‌లో సుమారు 2 లక్షల డాలర్ల వరకు డిపాజిట్ చేశాడు. ఇటీవలే తన తండ్రి హాస్పిటల్ పాలయ్యాడు. సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో హుస్సేన్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు వాళ్లు తాను దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వడం లేదని అతనికి ముందే తెలుసు. అందుకే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాలని అనుకున్నాడు. తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు.
ఇక చివరకు బ్యాంకు ఉద్యోగులను బంధించాడు. బ్యాంకులోనే గన్‌తో బెదిరిస్తూ వారిని నిర్బంధించాడు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు వచ్చారు. కానీ, పోలీసులు కూడా దూకుడుగా ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్థితి లేదు. హుస్సేన్ గన్ చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఇక తప్పక హుస్సేన్ బతిమిలాడే ప్రయత్నం చేశారు. తన డబ్బులు ఇప్పిస్తామని హుస్సేన్‌కు మాట ఇచ్చి సర్ది చెప్పారు. 35 వేల డాలర్ల తన డబ్బును బ్యాంకు నుంచి ఇప్పిస్తామని చెప్పినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 7 గంటలపాటు జరిగిన ఈ ప్రయత్నంలో చివరకు హుస్సేన్ లొంగిపోయాడు. పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు.
బ్యాంకు బయటే ఉన్న హుస్సేన్ భార్య మరియం చెహాది మాట్లాడుతూ.. తన భర్తకు ఉద్యోగులను నిర్బంధించడం మినహా మరే దారి లేకపోయిందని వివరించింది. తండ్రి సర్జరీ కోసం హుస్సేన్‌కు డబ్బులు తప్పనిసరి అయ్యాయని తెలిపింది. కాగా, హుస్సేన్ కు డబ్బులు అందలేవని ఆయన న్యాయవాది చెప్పారు.
2019లో లెబనాన్ ఆర్థిక సంక్షోభం మొదలైంది. అప్పటి నుంచి స్థానిక బ్యాంకులు, డిపాజిటర్లకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇది తాజా ఉదంతం. కానీ, ఇది వరకు చాలా సార్లు బ్యాంకులకు, అందులో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు మధ్య గొడవలు జరిగాయి.