యూకేలో కేరళ నర్సు, ఇద్దరు చిన్నారుల హత్య.. ఆమె భర్తే హంతకుడు.. బాధిత కుటుంబం ఆరోపణ

By Mahesh KFirst Published Dec 17, 2022, 7:48 PM IST
Highlights

యూకేలో కేరళ నర్సు, ఇద్దరు పిల్లల హత్య జరిగింది. భర్తే చంపేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. వారి మృతదేహాలు కేరళకు తీసుకురావడానికి రూ. 30 లక్షలు కావాల్సి ఉన్నది.
 

న్యూఢిల్లీ: కేరళకు చెందిన నర్సు, ఆమె ఇద్దరు పిల్లలు యునైటెడ్ కింగ్‌డమ్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఆమె భర్తే హంతకుడు అని, అతడు క్రూరుడు అని ఆ నర్సు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు వారి మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి రూ. 30 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. అది తమ తాహతుకు మించిన మొత్తం అని ఆ కుటుంబం తల్లడిల్లుతున్నది.

ఈ ఘటన తూర్పు ఇంగ్లాండ్‌లో నార్తంప్టన్ రీజియన్‌లోని కెట్టెరింగ్‌లో చోటుచేసుకుంది. కెట్టెరింగ్‌లో 35 ఏళ్ల నర్సు అంజు అసోక్, ఆమె ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెలు గాయాలతో ఇంటిలో గురువారం కనిపించారు. అంజు అసోక్ విగతజీవిగా కనిపించగా, ఇద్దరు పిల్లలు మాత్రం గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించినట్టు అక్కడి పోలీసులు తెలిపారు.

అంజు అసోక్ తల్లిదండ్రులు కేరళలో కొట్టాయం జిల్లా వైకోమ్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమ కూతురిని ఉరేసి చంపేసినట్టు పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడైందని లోకల్ పోలీసులు క్రితం రోజు రాత్రి తమకు తెలిపారని అన్నారు. అంజు అసోక్ భర్త, తమ అల్లుడు సాజు క్రూరుడు అని, అతడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ఆరోపించారు.

‘మనవరాలు పుట్టినప్పుడు వారు దుబాయ్‌లో ఉన్నారు. అప్పుడు సాజు తన కూతురు, మనవడిని కొట్టడం చూశా. అతను క్రూరుడు. క్షణాల్లో కోపంతో ఊగిపోతాడు. ఇంట్లో ఎప్పుడైనా ఒంటరిగా అతనితో ఉండాల్సిన వచ్చినప్పుడు భయంతో వణికిపోయేదాన్ని’ అని అంజు అసోక్ తల్లి పేర్కొంది. కానీ, తమ బిడ్డ ఎప్పుడూ అతనిపై తమకు ఫిర్యాదు చేయలేదని, అన్నీ మౌనంగా భరించిందని వివరించింది.

Also Read: మరోసారి కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8,000 బాతులు, కోళ్లలను చంపేలని ఆదేశం..

తాము తమ బిడ్డతో, మనవళ్లతో మాట్లాడాలన్న అతని అనుమతి తీసుకోవాలని, వీడియో కాల్ చేయడానికి కూడా టైమ్ అతడే నిర్దేశించేవాడని వివరించారు.

తండ్రి మాట్లాడుతూ, ‘నా కూతురు బెంగళూరులో నర్సింగ్ చేసింది. అక్కడే సాజును కలిసింది. అతను ట్రావెల్ ఏజెన్సీలో పని చేసేవాడు. నా బిడ్డే వారి పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చింది. మేం తటపటాయించాం. ఒక వేళ్ల వారి పెళ్లిని వారించినా అంగీకరిస్తా అని బిడ్డ చెప్పింది. కానీ, మరొకరితో పెళ్లికి ఒత్తిడి చేయవద్దని తెలిపింది. ఇద్దరూ వయోజనులు, చదువుకున్నవాళ్లే. కాబట్టి పెళ్లి చేయడానికి చివరికి అంగీకరించాం’ అని వివరించారు.

‘మేం మా బిడ్డ, మనవడు, మనవరాలిని కడసారి చూడాలనుకుంటున్నాం. అందుకు రూ. 30 లక్షలు కావాలి. 2018 వరదల్లోనే మేం అంతా పోగొట్టుకున్నాం. ఇప్పుడు మాకు 13 సెంటుల భూమి, ఈ ఇల్లు ఉన్నది. ఈ ఇల్లు అమ్మితే మా చివరి రోజుల్లో బతకడానికి కూడా ఆశ్రయమే ఉండదు. డబ్బు సేకరించడానికి మరే మార్గం కూడా నాకు కనిపించడం లేదు. కాబట్టి, ఎవరికి వారు ఎంత తోచినా సరే.. అందించి మాకు సహకరించాలని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. 

అంజు అసోక్ ఇంగ్లాండ్‌లో కెట్టెరింగ్ జనరల్ హాస్పిటల్‌లో 2001 నుంచి నర్సుగా పని చేసింది.

click me!