యువకులారా! మద్యం సేవించండి.. దేశాన్ని సుసంపన్నం చేయండి.. యువత కేంద్రంగా జపాన్ సంచలన స్కీమ్

By Mahesh KFirst Published Aug 20, 2022, 2:10 PM IST
Highlights

జపాన్ ప్రభుత్వం సంచలన స్కీమ్ ప్రకటించింది. యువతను మద్యం వైపు మళ్లించడానికి ఓ పోటీ నిర్వహిస్తున్నది. ఆల్కహాల్ ఎక్కువగా తాగించి తద్వార దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. కరోనా వచ్చినప్పటి నుంచి జపనీయులు మద్యానికి చాలా దూరంగా జరిగారని నిపుణులు చెప్పారు.
 

న్యూఢిల్లీ: మన దేశంలో మద్యపాన నిషేధం కోసం ఉద్యమాలే జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. కొన్ని చోట్లానైతే సంపూర్ణ మద్యపాన నిషేధం డిమాండ్లు ఉన్నాయి. ఇవి తరచూ ఎన్నికల నినాదాలుగానూ మారుతాయి. చాలా సార్లు మహిళల ఉద్యమాలకు ప్రధాన లక్ష్యంగా ఈ డిమాండ్ ఉన్నది. చాలా మంది ఈ నినాదాన్ని సమర్థిస్తారు. మన దేశంలోనూ పలు రాష్ట్రాలు మద్యపానం విక్రయాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. ఇదంతా మన దేశంలోని వ్యవహారం. కానీ, జపాన్ ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఆల్కహాల్ పై బ్యాన్ డిమాండ్లు కాదు కదా.. అక్కడ మద్యాన్ని సేవించడానికే ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో మొదటికే మోసం వచ్చిందని జపాన్ ఆవేదన చెందుతున్నది. మళ్లీ ఎలాగైనా యువతను మద్యం వైపు మళ్లించాలని కఠోర ప్రయత్నం చేస్తున్నది.

ఇదంతా విచిత్రంగానూ.. షాకింగ్‌గానూ ఉన్నప్పటికీ నిజమే. జపాన్ దేశం.. యువతను ఆల్కహాల్ సేవనం కోసం ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక క్యాంపెయినే ప్రారంభించింది. 

జపాన్‌లో యువత మద్యాన్ని దూరం పెడుతున్నారు. ఆల్కహాల్‌కు చాలా మంది దూరంగా జరిగారు. దీంతో దేశ రాబడి కూడా సన్నగిల్లుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. యువతను మద్యం వైపు మళ్లించాలని  నిశ్చయించుకుంది. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌లు, కరోనా తీవ్రతల వల్ల చాలా మంది మందుపై మనసు కొట్టేసుకున్నారు. దీంతో జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఇందుకోసం నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ ఒక నేషనల్ బిజినెస్ కాంటెస్ట్‌ను ప్రకటించింది. దానికి సేక్ వైవా అనే పేరు పెట్టింది. యువతలో మద్యం  సేవించడాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. 

సేక్, షోచు, అవామోరీ, బీర్, విస్కీ, వైన్ వంటి జపాన్ ఆల్కహాలిక్ డ్రింక్‌లకు డిమాండ్ పెంచడానికి బిజినెస్ ఐడియాలు ఇవ్వాలని యువత కేంద్రంగా ఓ ప్రకటన చేసింది. ఇది దేశ లిక్కర్ ఇండస్ట్రీకి పునరుత్తేజం తెచ్చి ఆర్థిక సమస్యలు చాలా వాటిని పరిష్కరిస్తుందని ఆ దేశం భావిస్తున్నది. 

ఈ క్యాంపెయిన్‌లో 20 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వారు ఉచితంగా సేక్ వైవా క్యాంపెయిన్‌లో పాల్గొని ఆల్కహాల్ డ్రింకింగ్ పెంచడానికి, డిమాండ్ కలిగించడానికి గల ఐడియాలను తెలుపవచ్చు. ఎలాంటి ప్రాడక్ట్‌లు కావాలి? ఆ మద్యం రుచి ఎలా ఉండాలి? వారి వారి లైఫ్ స్టైల్‌లకు అనుగుణంగా ఎలాంటి డిజైన్‌లలో అందుబాటులో ఉండాలి? వంటి అనేక రీతుల్లో సలహాలు ఇవ్వవచ్చు.

ఈ పోటీలో ఫైనలిస్టులను సెప్టెంబర్ 27న నిర్ణయిస్తారు.. అక్టోబర్‌లోనూ మరో రౌండ్ ఉండనుంది. టోక్యోలో నవంబర్ 10వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ వివరాల ప్రకారం, జపనీయులు కరోనా వచ్చినప్పటి నుంచి అంటే 2020 నుంచి మద్యం తాగడాన్ని చాలా వరకు తగ్గించారు. 1995తో పోల్చుకుంటూ మద్యం సేవనం మందగించింది. 1995లో 100 లీట ర్ల ఆల్కహాల్ సేవించగా.. ఇప్పుడు 75 లీటర్ల ఆల్కహాల్ తాగుతున్నారు.

click me!